ఆర్కే నిందను.. ఈ కోణంలో చూస్తే వారికే సిగ్గేస్తుంది!

బాబాయి వివేకానందరెడ్డి హత్య కు సంబంధించిన వార్త.. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఫోను ద్వారా తెలిసిందని, అప్పటికి ఆయన పార్టీ ముఖ్యులైన నలుగురు నాయకులతో కలిసి మేనిఫెస్టో మీటింగులో ఉన్నారని…

బాబాయి వివేకానందరెడ్డి హత్య కు సంబంధించిన వార్త.. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఫోను ద్వారా తెలిసిందని, అప్పటికి ఆయన పార్టీ ముఖ్యులైన నలుగురు నాయకులతో కలిసి మేనిఫెస్టో మీటింగులో ఉన్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తగా కనిపెట్టి తన కొత్తపలుకు రాతల్లో బయటపెట్టారు. దానిమీద ఇప్పుడు నానా రాద్ధాంతం జరుగుతోంది. 

పచ్చదళం సహజంగా దీనికి చిలవలు పలవలు చేర్చి వక్రమైన డిమాండ్లతో విరుచుకుపడుతోంది. ఇదంతా పక్కన పెట్టండి. రాధాకృష్ణ రాతల్ని నిజమే అనుకున్నప్పటికీ వీటిని మరో కోణంలో చూస్తే ఎలా ఉంటుందా అని అనిపిస్తోంది. అబద్ధాలను కళ్లకు కట్టినట్టుగా రాయడంలో అందెవేసిన చేయి అయిన రాధాకృష్ణ– ఈ కొత్త పలుకులో రాసిన ప్రతి మాట వాస్తవమే అని అనుకుందాం. అయినా ఈ కోణంలో ఓసారి గమనించాలి. 

జగన్ బాబాయి హత్య వార్త తెలిసిన తర్వాత, తన మేనిఫెస్టో కమిటీ మీటింగును కాసేపు కొనసాగించారనేది ఆర్కే ఆరోపణ. బాబాయి హత్య ఆయనలో చలనం తీసుకురాలేదని, కాబట్టి ఆయనకు తెలిసే ఆ హత్యజరిగి ఉంటుందని ఆయన రంగు పులమడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జీవితంలోంచి ఒక సంఘటనతో పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. 

వాస్తవ జీవితంలో జరిగిన సంఘటనే అయినప్పటికీ.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా చూసేవరకు ఈ ఘట్టం గురించి చాలా మందికి తెలియదు. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. నందమూరి తారక రామారావు మద్రాసులో సినిమా షూటింగులో ఉండగా.. ఆయన కొడుకు రామకృష్ణ తమ స్వగ్రామంలో చనిపోతాడు. షూటింగు మధ్యలో ఆ కబురు తెలుస్తుంది. 

రామారావు తన విషాదాన్ని దిగమింగుకుని.. ఆ వార్త ఎవ్వరికీ చెప్పకుండా, షూటింగు పూర్తిచేసి ఆ తర్వాత కారులో ఊరికి వెళ్తాడు. అక్కడ ఆ సీను ద్వారా.. రామారావుకు తన వృత్తి జీవితం పట్ల ఎంతటి కమిట్ మెంట్ ఉన్నదో, తన నిర్మాతకు నష్టం రాకుండా ఉండడానికి తన కన్న కొడుకు చనిపోయినా సరే.. లెక్కచేయకుండా వ్యవహరించిన ఎంతటి త్యాగశీలత ఉన్నదో తెలియజెప్పడానికి ప్రయత్నించారు. 

ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన బాబాయి మరణ వార్త తెలిసిన తర్వాత (ఆర్కే రాసినదంతా నిజమైన పక్షంలో) కాసేపు మీటింగు కొనసాగించడాన్ని మాత్రం ఆయన కర్కశత్వానికి ప్రతీకగా చాటిచెబుతున్నారు. నాలుగున్నరకు మీటింగు అంటే జగన్ అప్పటికే తాను తయారై కూర్చుని ఉంటారని అనుకోవచ్చు. కబురు తెలిసింది. అప్పటికప్పుడు బయల్దేరడానికి కనీసం డ్రైవరు ఉండాలి కద. 

ఆ సమయంలో ఇంటికెళ్లి నిద్రిస్తూ ఉండే డ్రైవరును పిలిపించడానికి కనీసం అరగంట పడుతుంది కద. ఈ వ్యవధిలో కాసేపు ఆయన మీటింగులోనే కూర్చుని ఉండవచ్చు. కానీ.. ఇదంతా మాత్రం జగన్ కర్కశత్వం అని చాటిచెప్పడం పచ్చదళం ప్రయత్నం. 

కొడుకు చచ్చిపోయినా షూటింగులో హీరోయిన్ తో సరసాలాడిన నందమూరి తారకరామారావు తీరు మాత్రం.. త్యాగం. వృత్తి పట్ట నిబద్ధత. అంతకంటె తక్కువ స్థాయిలోనే జగన్ స్పందన ఉంటే మాత్రం అది కర్కశత్వం. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు! నిందలు వేసే వారికి సిగ్గు అనిపించదా?