జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఏపీ సమాజం జగన్‌ను ఎలా చూస్తుందో కానీ, పవన్ మాత్రం ఒక రాక్షసుడిగా పరిగణిస్తున్నారు. రాజకీయంగా జగన్‌ను అంతం చేస్తే, తనకు మంచి రోజులు వచ్చినట్టుగా ఆయన భావిస్తున్నట్టున్నారు. కేవలం జగన్ అనే ఒకే ఒక్కడితో పవన్ బాగా డిస్ట్రబ్ అయ్యినట్టు కనిపిస్తోంది.
తనకు భయం లేదని, చావంటే లెక్క చేయనని, అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ పవన్ చెబుతున్న దానికి, ఆచరణకు పూర్తి విరుద్ధం. జగన్ అంటే పవన్‌కు చచ్చేంత భయం. తననేం చేస్తాడో అని నిద్రలో కూడా పవన్ కలవరించేలా ఉన్నాడని ఆయన మానసిక స్థితి తెలియజేస్తోంది. జగన్ అంటే భయం లేకపోతే…పవన్ పదేపదే ఆ మాట అనేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
“జగన్.. మీ నాన్నకే భయపడలేదు. నువ్వెంత, నీ బతుకెంత” అని పవన్ తరచూ అంటున్నారు. వైఎస్సార్ పట్టువిడుపులతో వెళ్లే వారని రెండు రోజుల క్రితం పవనే అన్నారు. మళ్లీ తానే మీ నాన్నకే భయపడలేదని అనడం గమనార్హం. “మీ నాన్నే నాపై ఎన్నో కేసులు పెట్టి…ఏమీ పీక్కో లేకపోయాడు. నువ్వెంత జగన్” అని తరచూ చంద్రబాబు కూడా అనేవారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇప్పుడెక్కడ ఉన్నారో మనందరికీ తెలిసిందే.
వైఎస్సార్ కంటే జగన్ వంద రెట్లు పట్టుదల కలిగిన నాయకుడని ఆయన్ను దగ్గరగా చూసే వారు చెబుతున్న మాట. జగన్ అంటే భయం లేకపోతే.. మీ నాన్నకే భయపడలేదని పవన్ ఎందుకంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఎన్డీఏలో జనసేన లేదని వైసీపీ విమర్శిస్తే.. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏంటో చూద్దాం.
“175 సీట్లు వస్తాయన్న మీరు మాకు ఎందుకు భయపడడం. ఎన్డీఏ కూటమిలో ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది ఏమిటీ. మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే, మీరు బలహీనపడుతున్నారని అర్ధం” అని పవన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
వైఎస్సార్‌తో తలపడ్డానని, ఇక ఆయన తనయుడుడైన నువ్వెంత జగన్ అని ప్రశ్నిస్తున్న పవన్.. ఎందుకని సీఎంను టార్గెట్ చేశారో చెప్పాలి. జగన్ అంటే భయం లేకపోతే ఒంటరిగా తలపడి వీరమరణం పొందనని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో జనానికి సమాధానం చెప్పాలి.
టీడీపీ బలహీనంగా వుంది, దానికి తమ పార్టీ యువశక్తి తోడు కావడం, ఎన్టీఏ సహకారంతో వైసీపీని గద్దె దించుతానని ఎందుకు చెప్పాల్సి వస్తోందో వివరణ ఇవ్వాలి. కేవలం జగన్ అంటే భయం వల్లే… ఎన్డీఏతో సంబంధం లేకుండా, దాని సహకారం ఉందని పవన్ చెప్పుకోవాల్సిన దయనీయ స్థితిని చూస్తున్నాం. బాబు కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చానని చెప్పిన 24 గంటల్లోనే.. పవన్ తూచ్ తూచ్ అన్నారంటే, ఎవరి భయంతో యూ టర్న్ తీసుకున్నారో జనానికి తెలియదని అనుకుంటే ఎట్లా?