Mad Review: మూవీ రివ్యూ: మ్యాడ్

చిత్రం: మ్యాడ్ రేటింగ్: 2.75/5 తారాగణం: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రాం నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి, అనంతిక, గోపికా ఉదయన్, రఘు బాబు, రచ్చ రవి, విష్ణు, తదితరులు సంగీతం:…

చిత్రం: మ్యాడ్
రేటింగ్: 2.75/5
తారాగణం: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రాం నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి, అనంతిక, గోపికా ఉదయన్, రఘు బాబు, రచ్చ రవి, విష్ణు, తదితరులు
సంగీతం: భీంస్ సిసిరీలియో
కెమెరా: షందత్-దినేష్ కృష్ణన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
విడుదల: 6 అక్టోబర్, 2023

“జాతిరత్నాలు” తర్వాత ఆ తరహా యూత్ కామెడీలకి గిరాకీ పెరిగింది. టార్గెట్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసే ఇలాంటి సినిమాలకి ఆదరణ ఉంటోంది. ఏ మాత్రం కామెడీ వర్కౌట్ అయినా చాలు బాక్సాఫీసు కళకళలాడుతుంది. “మ్యాడ్” టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ యూత్ ఆడియన్స్ నుంచి ఆదరణ పొందింది. ఇంతకీ ఎలా ఉందో చూద్దం. 

కాలేజిలో చేరిన ఒక స్టూడెంట్ అక్కడి పరిస్థితులు నచ్చక పారిపోదామంకుంటాడు. కానీ అతను సీనియర్స్ కి దొరుకుతాడు. లడ్డు (విష్ణు) అనే ఒక సూపర్ సీనియర్ ఆ స్టూడెంట్ కి ఆ కాలేజిలో ఒక బ్యాచ్ కథని ఫ్లాష్ బ్యాక్ గా చెప్తాడు. సినిమా అంతా అదే. 

మ్యాడ్ అనే టైటిల్ కథాపరంగా మనోజ్-అశోక్-దామోదర్ అనే ముగ్గురి స్నేహితుల పేర్లలోని మొదటి అక్షరాల కలయిక. వీరిలో మనోజ్ (రాం నితిన్)కి శృతి (శ్రీ గౌరిప్రియ) అనే అమ్మాయి నచ్చుతుంది. అశోక్ (నార్నె నితిన్) తనని తాను ఒక అనాథగా పరిచయం చేసుకుంటాడు. అతనంటే జెన్ని (అనంతిక) అనే అమ్మాయికి ఇష్టం. దామోదర్ (సంగీత్ శోభన్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తనకి ఏ అమ్మాయి ప్రొపోజ్ చేయదని బలంగా నమ్ముతుంటాడు. కానీ అనుకోకుండా వెన్నెల పేరుతో దామోదర్ కి ఒక లెటర్ అందుతుంది. అది తన ఫ్రెండ్స్ చేసిన పని అనుకుంటాడు దామోదర్. కానీ ఆ అమ్మాయి స్వయంగా తనతో హాస్టల్ కి ఫోన్ చేసి మాట్లాడడంతో నమ్ముతాడు. 

అలా ఫ్లాష్ బ్యాక్ లో మనోజ్, అశోక్, దామోదర్ అనే స్నేహితులు కలిసిన విధానం, వాళ్లకి ఏర్పడ్డ ప్రేమలు, హాస్టల్లో ర్యాగింగ్ సీన్లు..ఇలా అన్నీ సరదాగా సాగిపోతుంటాయి. కథ చివరికి వచ్చేసరికి వెన్నెల సస్పెన్స్ పీక్ కి చేరుతుంది. ఎవరా వెన్నెల? చివరికి మన హీరోల్లో ఒకడు ఆ వెన్నెలని చేరతాడా అనేది క్లైమాక్స్. 

కాలేజ్ నేపథ్యంలో సాగే సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది 2007 నాటి హ్యాపీ డేస్. సున్నితమైన ప్రేమ, సహజమైన భావోద్వేగాలు, సమతూకంలో ఉండే సహజత్వం కలగల్సిన చిత్రమది. ఇప్పుడు 2023లో వచ్చిన ఈ సినిమా కూడా పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో తీసిందే. 

కథలో కన్విక్షన్ ఉన్నా ఆద్యంతం లైటర్ వెయిన్ లో నడిపిన కథనం వరకు బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల శ్రుతి మించిన బూతులు (ర్యాగింగ్ సీన్లో ట్యూబ్ లైట్ ఎపిసోడ్), అసహ్యమైన మాటలు టార్గెట్ ఆడియన్స్ కి ఎలా ఉన్నా మిగిలినవారికి చిరాకు తెప్పిస్తాయి. 

అంతే కాకుండా ఆద్యంతం బీర్లు తాగుతూ, సిగిరెట్లు పీలుస్తూ కాలేజ్ స్టూడెంట్స్ ని చూపించడం కూడా అనవసరం. తెర మీద చూపించాలనుకునే హాస్యానికి ఆ సరంజామాతో పని లేదు. అయినా ఎందుకో యూత్ సినిమా అంటే తాగుడు కామన్ అయిపోయింది. కొంతలో కొంత సంతోషించదగ్గది ఏమిటంటే డ్రగ్స్ సీన్లు పెట్టలేదంతే. వాటిని మినహాయిస్తే మిగిలిన సినిమా అంతా సరదాగానే సాగింది. 

ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ పాటలు బాగోకపోవడం. ఇలాంటి యూత్ఫుల్ సినిమాల్లో పాటలు బాగుంటే సినిమా స్థాయి పెరుగుతుంది. కానీ ఆ దిశగా అసలు కృషే చేయలేదు. “సింగిల్ గా ఉండు మామా..” పాట ఎత్తుగడ బాగున్నా పెద్దగా మేటర్ లేనట్టే ముగిసింది. కాలేజ్ ఫెస్ట్ సాంగ్ కూడా ఏదో దరువుపాటలా ఉంది తప్ప గుర్తుంచుకోదగ్గ పదాలు వినపడలేదు. 

ఇక కొన్ని సన్నివేశాలు మరీ ఔట్ డేటెడ్ గా ఉన్నాయి. బుర్కాలేసుకుని అబ్బాయిలు లేడీస్ హాస్టల్లోకి వెళ్లడం, ఎక్జాం హాల్లొ స్లిప్పులు, అలాగే అమ్మాయిని ఏడిపించే రౌడీలు-సీన్లోకి హీరో వచ్చి ఫైట్ చేయడం..ఇవన్నీ మరీ ఓల్డ్ టైపులో ఉన్నాయి. 

సినిమా మొత్తానికి హైలైట్ మాత్రం సంగీత్ శోభన్ నటన. డైలాగ్ టైమిమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాల్లోనూ పూర్తి పరిణతి చూపించాడు. నవీన్ పోలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ లిస్టులో యంగ్ మాస్ హీరో స్థాయిని పొందే సత్తా అతనిలో ఉంది. 

ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ బావమరిది నార్నే నితిన్ మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కాలేజ్ స్టూడెంట్ పాత్రలో అంత అప్పీలింగ్ గా లేడు. మాస్ హీరోగా నిలబడే ఆలోచనతో స్టైలిష్ ఫైట్లు గట్రా చేసాడు కానీ సంగీత్ శోభన్, రాం నితిన్ ల సరసన కాలేజ్ స్టూడెంట్ గా మాత్రం తేలిపోయాడు. అతనికి సూటయ్యే మాస్ తరహా చిత్రాలు ఏమో కానీ కాలేజ్ స్టోరీస్ సెట్ కావు. 

మరో నటుడు రాం నితిన్ కూడా ప్రామిసింగ్ గానే ఉన్నాడు. కామెడీ, డైలాగ్ టైమింగ్ తో పాటు చూడ్డానికి కూడా బాగున్నాడు. 

లడ్డూగా నటించిన విష్ణు కూడా సటిల్ కామెడీని పండించాడు, తమిళ నటుడు యోగిబాబు టైపులో. 

జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఒక చిన్న సీన్లో కనిపించాడంతే. 

రఘు బాబు, మురళీధర్ గౌడ్ మిగిలిన నటీనటులంతా వారివారి పాత్రలకి సరిపోయారు. 

హీరోయిన్స్ ముగ్గురూ ఎవరికి వారే అన్నట్టు ఆకట్టుకున్నారు. గౌరీ ప్రియ గ్లామర్ తో ఆకర్షిస్తే, అనంతిక అందంతో పాటూ అభినయాన్ని కూడా చూపింది. అలాగే గోపికా ఉదయన్ కూడా కంటికింపుగా తెరకి నిండుగా ఉంది. 

ఆడియన్స్ కాలేజ్ ఏజ్ మైండ్ సెట్ కి వెళ్ళిపోయి, ఏదీ జడ్జ్ చేయకుండా అంతా ఒక ఫార్స్ కామెడీని చూస్తున్నట్టుగా చూస్తే వినోదాన్ని ఆస్వాదించొచ్చు. సెన్సార్ కత్తెర కాస్త మెరుగ్గా పనిచేసుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. టైటిల్ మ్యాడ్ అయినప్పటికీ ఇది మూడ్ మాత్రం పాడుచేయదు. యూత్ కామెడీ కోరుకునేవారికి పైసావసూల్ అనిపిస్తుంది. 

బాటం లైన్: “పిచ్చ”కామెడీ!