Rules Ranjann Review: మూవీ రివ్యూ: రూల్స్ రంజన్

చిత్రం: రూల్స్ రంజన్ రేటింగ్: 1.5/5 తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహెర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అను కపూర్, అజయ్, విజయ్ పట్కర్, మకరంద్…

చిత్రం: రూల్స్ రంజన్
రేటింగ్: 1.5/5
తారాగణం:
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహెర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అను కపూర్, అజయ్, విజయ్ పట్కర్, మకరంద్ దేష్పాండే, నెల్లూర్ సుదర్షన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం: అమ్రీష్
నిర్మాతలు: దివ్యాంగ్ లవనియా, మురళి కృష్ణ వేమూరి
దర్శకత్వం: రతినం కృష్ణ
విడుదల తేదీ: 6 అక్టోబర్, 2023

కెరీర్ లో అస్సలు గ్యాప్ రాకుండా చూసుకుంటూ వరుసపెట్టి సినిమాలతో ముందుకొస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అతను తొలుత చేసిన ఒకటి రెండు సినిమాల కారణంగా తన చిత్రాల్లో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే అభిప్రాయం ఇంకా యూత్ లో ఉంది. అందుకే, వరుసగా తన సినిమాలు ఫ్లాపవుతున్నా తన సినిమాలకి అటెన్షన్ ఉంది. ఇప్పుడీ “రూల్స్ రంజన్” కేవలం “సమ్మోహనుడా…” పాట వల్ల జనం దృష్టిని తిప్పుకుంది. ఇంతకీ సినిమాలో మ్యాటరెంతుందో చూద్దాం. 

తిరుపతికి చెందిన మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ చదివి ముంబాయిలో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తాడు. తనకంటూ కొన్ని విలువల్ని పెట్టుకుని పద్ధతిగా జీవిస్తుంటాడు.

తనకిష్టమైన తన కాలేజ్ బ్యూటీ సన (నేహా శెట్టి) చాలాకాలం తర్వాత ముంబాయి మెట్రో స్టేషన్లో దర్శనమిచ్చి ఒకరోజు తనతో గడుపుతుంది. కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకోకుండా ఆమెను తిరుపతికి సాగనంపుతాడు మనోరంజన్. 

ఆమెని మళ్లీ ఎప్పుడు కలుస్తాడు? ఎలా కలుస్తాడు? వాళ్ల పరిచయం పెళ్లితో కొలిక్కి వస్తుందా రాదా అనేది కథ!

ఏ సినిమా కథకైనా ప్రాధమికమైన అంశం కాన్-ఫ్లిక్ట్ పాయింట్. అది సినిమా మొదలైన తర్వాత ఎంత త్వరగా వస్తే అంత మంచి స్క్రీన్ ప్లే అనిపించుకుంటుంది. కానీ అదేంటో చిత్రంగా ఇందులో ఆ పాయింట్ సినిమా ఇంకొక పావుగంటలో ముగుస్తుందనగా వస్తుంది. అంతవరకు ప్రేక్షకులు ఏమైపోవాలి! ఏ పాయింటుని పట్టుకుని సినిమా చూడాలి?! ఈ ప్రశ్నలు వేసుకుని ఉంటే స్క్రిప్ట్ దశలోనే రిపేర్ జరిగుండేదేమో! 

ఇంత దయనీయమైన రచన ఈమధ్య కాలంలో ఏ సినిమాలోనూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఆద్యంతం ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా పేలకుండా రాసుకున్న తీరు చూస్తే జాలేస్తుంది. 

పేపర్ మీద రాసుకున్న ప్రతీదీ డైలాగైపోదు. రాసుకున్నప్పుడు పంచ్ లాగ అనిపించిన డైలాగ్ తెరమీదకెక్కే సరికి పలచబడిపోవచ్చు. అందుకే, ఎంత బౌండ్ స్క్రిప్ట్ చేతిలో ఉన్నా సెట్ మీద కూడా ఆర్టిస్టుల టైమింగుని బట్టి, ఇంప్రొవైజేషన్స్ చేస్తూనే ఉంటారు దర్శకత్వ విభాగం. ఆ భయం ఏ మాత్రం లేకుండా రాసుకున్న మొదటి వెర్షన్ నే తెరకెక్కించడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు. ఫలితంగా పాయింట్లెస్ పెయిన్ గా మారింది ఈ చిత్రం. 

చివరాఖర్న వచ్చే పావుగంట బిట్ కోసం రెండుంపావు గంటల టార్చర్ భరించాల్సిరావడం ప్రేక్షకులు చేసుకున్న పాపం. 

పూర్తిగా దర్శకుడినే అనలేం. స్క్రిప్ట్లో తల పెట్టి చూడగల ట్యాలెంటుందని చెప్పుకుంటున్న కిరణ్ అబ్బవరం కూడా కోరి కోరి ఈ సినిమా ఎందుకు చేసాడో అర్ధం కాదు. 

పాత్రలు, పాత్రధారులు అన్నీ పెదవి విరిచేట్టే ఉన్నాయి. ముంబాయి ఎపిసోడ్ లో తుకారాం అనే సెక్యూరిటీ గార్డ్ పాత్రని ప్రధాన కమెడియన్ పాత్ర అనుకుని రాసుకున్నట్టున్నాడు దర్శకుడు. అతను చేసిన యాక్షన్, చెప్పిన డైలాగ్ ఇరిటేషన్ తెప్పిస్తుంది తప్ప అరనవ్వు కూడా నవ్వించదు.

అలాగే బాలీవుడ్ యాక్టర్ అనూకపూర్ ని ఒక కంపెనీ మేనేజర్ పాత్రలో అత్యంత పేలవంగా బీగ్రేడ్ నటుడిలా చూపించారు. యాచకుడి పాత్రలో మకరంద్ దేష్పాండే అయితే మరీ హీనం. ఈ నటులకి ఏం చెప్పి ఈ పాత్రలకి ఒప్పించారో పాపం అనిపిస్తుంది!

అలాగే రక్తచరిత్రలో బుక్కారెడ్డి పాత్రతో తెలుగు వారికి పరిచయమైన అభిమన్యుసింగ్ సెకండాఫ్ చివర్లో సగటు సీమపెద్ద పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్రకి అతనే ఎందుకో అర్ధం కాదు. ఇలా క్యాస్టింగ్ పరంగా ద్వితీయార్థం చివర్లో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్లారు కానీ కథ,కథన, సంభాషణల్లో ఎందులోనూ విషయం చూపకపోవడం వల్ల ప్రేక్షకులకి నీరసమే మిగిలింది. 

సినిమా మొదలై ఇంటెర్వల్ కాకుండానే హాల్లో కొన్ని వాకౌట్లు కనిపించాయి. ఇంటర్వెల్ అయ్యాక మిగిలిన జనంలో అధికశాతం మంది ఎక్జిట్ డోర్ కి దగ్గరగా కూర్చున్నారు. వాళ్లల్లో కొంతమంది “సమ్మోహనుడా” పాట అవ్వగానే బయలుదేరారు. 

వైవా హర్ష, హైపర్ ఆది లాంటి వాళ్లున్నా కూడా ఎక్కడా కామెడీ పండక చిరాకొచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవాలి! చివర్లో వచ్చిన అజయ్, సుబ్బరాజులు కూడ ఫొర్స్డ్ కమెడియన్స్ లా కనిపించారు. 

సినిమా వాలకం ఇలా ఉండడం వల్ల కిరణ్ అబ్బవరంలో కూడా మునుపు కనపడని లోపాలు కనపడ్డాయి. మొదటి నుంచి చివరిదాకా భిన్నమైన హావభావాలు పలక్కుండా ఒకటి రెండు ఎక్స్ప్రెషన్స్ తోటే నెట్టుకొచ్చాడన్న విషయం అర్ధమయ్యింది. డ్యాన్సుల్లో మూవ్స్ బాగానే ఉన్నా సగటు కమెర్షియల్ హీరోకి కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అతనిలో కనిపించడం లేదు. సరైన కథా,కథనాలు, సంభాషణలు ఉంటే ఈ లోపాలు అంతగా కనపడవు. ఇలాంటి చిత్రాలు ఇంకో రెండు చేస్తే జనం ఇతని సినిమాల్ని పక్కన పెట్టేసే ప్రమాదముంది. 

వెన్నెల కిషోర్ పాత్ర కూడా నవ్వించలేదు. తాను కూడా కామెడీ చేస్తున్నాననే భ్రమలోనే ఏదేదో చేసాడు.

పాత్రధారుల సంగతి పక్కన పెడితే రచనలో లోటుపాట్లు అనేకం. బీటెక్ చదివిన వాడికి హిందీరాకపోయినా పర్వాలేదు, కనీసం బ్రోకెన్ ఇంగ్లీష్ కూడా రాదా! “ప్యాంట్రీ” అంటే ఏంటో కూడా తెలీదా!

కంప్యూటర్ ఫైల్ కి, మామూలు ఫైల్ కి తేడా తెలియని వాడు కాసేపట్లోనే తన సీనియర్ ఇచ్చిన ప్రాజెక్టుని రాత్రంతా కూర్చుని చేసేస్తాడు.

ఆ వెంటనే మరొక సీన్లో తన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడేటంత తెలివిని ప్రదర్శించి ప్రొమోషన్ కూడా కొట్టేస్తాడు. 

పాత సినిమాల్లో హీరోలు రిక్షా తొక్కి నెలలో లక్ష రూపాయలు సంపాదించినట్టు ఇతను ఏం తొక్కి అంత త్వరగా అంత తెలివి సంపాదించాడో సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు. 

ఇదిలా ఉంటే ఆ ముంబాయి ఆఫీసువాళ్లందరినీ 30 రోజుల్లో తెలుగు పుస్తకాలు కొనిపించి వాళ్లకి “ఉప్పు కప్పురంబు” పద్యాలు గట్రా నేర్పుతాడు. దానికి, ఈ కంపెనీ చేసే వ్యాపారానికి లింకేంటో మరి! దానిని కూడా కామెడీ అనుకోమంటే ఏం చేసేది లేదు. 

రూల్స్ పాటించే ఈ రంజన్ ఆఫీసులోనే కాకుండా తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కూడా రూల్స్ పెడతాడు. అస్సలు అర్ధంపర్ధం లేని క్యారెక్టరైజేషన్ ఈ కథానాయకుడిది. 

హీరోయిన్ నేహాశెట్టి, మెహెర్ చాహల్ ఇద్దరూ చూడ్డానికి బాగానే ఉన్నా క్యారెక్టరైజేషన్స్ మాత్రం వీక్. ఈ ఇద్దరూ ఒక సీన్లో మందు కొట్టడంలో పోటీ పెట్టుకుని పెగ్గుల మీద పెగ్గులు తాగుతుంటారు. నేహాశెట్టి పాత్రైతే హీరోతో తొలిసారి ముంబాయిలో కలిసిన రాత్రే మందుకొట్టేసి అతని పక్కలో పడుకుంటుంది. ఇదంతా ఒక్క రోజులో కలిగిన “కల్మషం లేని స్వచ్ఛమైన స్నేహంతో కూడిన ఇష్టం” అనుకోమంటే చేసేదేం లేదు!

టెక్నికల్ గా కూడా ఇందులో పాటలు వీక్. ఒక్క సమ్మోహనుడా తప్ప మిగిలిన పాటలేవీ బాలేదు. 

ఇందులో రంజన్ మీద కోపం తెచ్చుకున్న సీన్లో వెన్నెల కిషోర్ డైలాగ్ ఒకటుంది- “ఏ రంజనో చెప్తే ఆడియన్స్ ఫీల్ అవుతారని చెప్పట్లేదు కానీ..గొంతు దాకా వచ్చింది” అంటాడు. అలాగే ఇక్కడ చేతిదాకా వస్తోంది కానీ రాయట్లేదు! 

సినిమా రచనలో బేసిక్ మెజర్మెంట్స్ పాటించకుండా, డైలాగ్ విషయంలో కనీసమైన హోం వర్క్ చేయకుండా, స్క్రిప్ట్ లోతుని పట్టించుకోకుండా, స్క్రీన్ ప్లే ఎటుపోతోందో లెక్కేసుకోకుండా తీసిన ఈ సినిమా పూర్తిగా “రూల్స్” తప్పింది. స్క్రిప్ట్ ఎలా ఉండకూడదో చెప్పింది. 

బాటం లైన్: “రూల్స్”తప్పిన చిత్రం