వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వెన‌క్కు త‌గ్గేది లేదు: తేల్చేసిన‌ కేంద్రం

గ‌త రెండు వారాలుగా ఢిల్లీ ప‌రిస‌రాల్లో రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూ ఉన్నా.. తాము తెచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అటు రైతు సంఘాల‌తో సంప్ర‌దింపులు…

గ‌త రెండు వారాలుగా ఢిల్లీ ప‌రిస‌రాల్లో రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూ ఉన్నా.. తాము తెచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అటు రైతు సంఘాల‌తో సంప్ర‌దింపులు అని అంటూనే.. మ‌రోవైపు బిల్లులను వెన‌క్కు తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

వాస్త‌వానికి తాము తెచ్చిన ఎలాంటి చ‌ట్టాల విష‌యంలో అయినా.. ఇలాంటి చ‌ర్చ‌ల‌కు మోడీ ప్రభుత్వం ఇష్ట‌ప‌డ‌లేదు ఇన్నాళ్లూ. నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కానీ, ప‌ర్య‌వ‌స‌నాల గురించి చ‌ర్చకు ఎప్పుడూ ముందుకు వెళ్ల‌లేదు. ప్ర‌త్యేకించి రెండో ప‌ర్యాయంలో తిరుగులేని మెజారిటీ ల‌భించ‌డం, రాజ్య‌స‌భ‌లో కూడా బీజేపీకి బ‌లం పెర‌గ‌డంతో.. తాము చేయాల‌నుకున్న దానికి పార్ల‌మెంట్ లో ద‌గ్గ‌రుండి సీల్ కొట్టించేసుకోగ‌లుగుతోంది మోడీ ప్ర‌భుత్వం. 

ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు నంబ‌ర్లు కూడా లేక‌పోవ‌డంతో.. మోడీ ప్ర‌భుత్వం ఏ అంశ‌లోనూ ఎవ‌రి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే వ్య‌వ‌సాయ బిల్లుల ఆమోదం కూడా చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. అవి ఆమోదం పొందిన నాటి నుంచి పంజాబ్, హ‌ర్యానాల్లో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. అవి ఆ రాష్ట్రాల వ‌ర‌కే ప‌రిమితం అయినంత వ‌ర‌కూ మిగ‌తా రాష్ట్రాల్లో వాటిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

అయితే ఒక్క‌సారి ఢిల్లీకి చేర‌డంతో.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. నిన్న జ‌రిగిన భార‌త్ బంద్ అనేక రాష్ట్రాల్లో విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఇక సోష‌ల్ మీడియా ద్వారా కూడా దేశ వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తూ ఉంది. రాజ‌కీయాల‌తో నిమిత్తం లేకుండా అనేక మంది రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో రైతు సంఘాల‌తో చ‌ర్చ‌లు అంటూ కేంద్ర ప్ర‌భుత్వం హ‌డావుడి చేస్తూ ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రైతుల‌తో స‌మావేశం అయిన మంత్రులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వ్య‌వ‌సాయ బిల్లుల‌పై వెన‌క్కు త‌గ్గే అవ‌కాశ‌మే లేని తేల్చి చెప్పిన‌ట్టుగా రైతు సంఘాల వాళ్లు ప్ర‌క‌టించారు. 

బిల్లుల‌పై వెన‌క్కు త‌గ్గేది లేద‌ని అమిత్ షాతో స‌హా కేంద్ర మంత్రులు స్ప‌ష్టం చేశార‌ని, అలాగే తాము కూడా ఆందోళ‌న‌ల విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని రైతు సంఘాలు స్ప‌ష్టం చేశాయి. అయితే స‌వ‌ర‌ణ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పింద‌ట‌. ఆ స‌వ‌ర‌ణ‌లు ఏమిటో లిఖిత పూర్వ‌కంగా రైతు సంఘాల‌కు తెలియ‌జేస్తాయ‌ట‌. కానీ కేంద్రం ప్ర‌తిపాదిస్తున్న స‌వ‌ర‌ణ‌ల విష‌యంలో కూడా రైతులు అనుకూలంగా లేరు. బిల్లుల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని, మ‌ద్ద‌తు ధ‌ర‌ల విష‌యంలో చ‌ట్టం చేయాల‌ని రైతు సంఘాలు కోరుతున్నాయి.

దేన్ని త‌యారు చేసే వాడికి అయినా.. దాని ధ‌ర‌ను నిర్దేశించే హ‌క్కు ఉంది ఈ భూ ప్ర‌పంచం మీద‌. అయితే పంట పండించే రైతుకు మాత్రం  ఆ హ‌క్కు లేదు. ఇలాంటి మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో రైతుల డిమాండ్ చేస్తూ ఉన్నారు.

ఆ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేదు. అలాంటి అవ‌కాశాన్ని రైతుల‌కు ఇచ్చేందుకు మోడీ ప్ర‌భుత్వం స్ట్రిక్ట్ గా నో చెబుతోంది. ఈ ప‌రిస్థితుల్లో రైతులు కూడా వెన‌క్కు త‌గ్గేలా లేరు కాబట్టి.. ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వెళ్తుంద‌నేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

మళ్ళీ అదే ప్రశ్న