వైసీపీ చావు దెబ్బ‌

భార‌త్ బంద్ విష‌యంలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీని అధికార పార్టీ వైసీపీ చావుదెబ్బ తీసింది. దీంతో ఆ పార్టీ విల‌విల‌లాడుతోంది. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను ర‌ద్దు చేయాల‌నే ఏకైక డిమాండ్‌తో…

భార‌త్ బంద్ విష‌యంలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీని అధికార పార్టీ వైసీపీ చావుదెబ్బ తీసింది. దీంతో ఆ పార్టీ విల‌విల‌లాడుతోంది. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను ర‌ద్దు చేయాల‌నే ఏకైక డిమాండ్‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

కేంద్ర ప్ర‌భుత్వానికి రైతులు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఆందోళ‌న‌ను ఉదృతం చేసే క్ర‌మంలో నిన్న చేప‌ట్టిన భార‌త్ బంద్ కూడా దేశ వ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి.

కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాల‌ను లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు టీఆర్ఎస్ వ్య‌తిరేకించింది. నిన్న‌టి భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో పాటు మంత్రులు మొద‌లుకుని కిందిస్థాయి నాయ‌కులంతా రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. 

మ‌రోవైపు దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల్లో వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వైసీపీ, టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో రైతుల న్యాయ‌మైన డిమాండ్‌కు ఏపీలోని రాజ‌కీయ ప‌క్షాలు మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అయితే భార‌త్ బంద్‌కు కొన్ని గంట‌ల ముందు అధికార పార్టీ వైసీపీ వేసిన ఎత్తుకు టీడీపీ చిత్తు అయింది. భార‌త్ బంద్‌కు ఏపీ ప్ర‌భుత్వం సంఘీభావం ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ బ‌స్సులను తిప్ప‌లేదు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు మూసేయాల‌ని ముందురోజు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఆ విధంగానే చేసి బంద్ విజ‌యవంతం కావ‌డంలో వైసీపీ క్రియాశీల‌క పాత్ర పోషించింది. 

అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విధ‌మైన వైఖ‌రి తీసుకుంటుంద‌ని టీడీపీ అస్స‌లు ఊహించ‌లేదు. ఎటూ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అధికార ప‌క్షంతో పాటు తాము కూడా ముందుకు పోలేమ‌నే ఉద్దేశంతో టీడీపీ నిర్ల‌క్ష్యంగా ఉండిపోయింది.  దీంతో  వైసీపీపై విమ‌ర్శ‌ల‌తో మీడియాలో ప్ర‌చారానికి ప‌రిమిత‌మైంది.

అనూహ్యంగా వైసీపీ భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో తానెక్క‌డ రైతు వ్య‌తిరేక పార్టీగా మిగిలిపోతానో అనే భ‌యంతో హ‌డా వుడిగా టీడీపీ త‌న పంథా మార్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే వైసీపీ నిర్ణ‌యం త‌ర్వాతే టీడీపీ భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చింద‌నే సందేశం జ‌నాల్లోకి వెళ్లిపోయింది. పోనీ భార‌త్ బంద్‌లో టీడీపీ నేత‌లు  చిత్త‌శుద్ధితో పాల్గొన్నారా అంటే అదీ లేదు.  

ప్రతిపంటకు మద్దతు ధర కల్పించాలని, గిట్టుబాటు ధర రాకపోతే, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, మార్కెట్‌ యార్డులను కొనసాగించాలని డిమాండ్‌తో జిల్లా కలెక్టర్లు, డీఆర్వోలు, సబ్‌కలెక్టర్లకు టీడీపీ నేత‌లు వినతి పత్రాలు అందజేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని విన‌తిప‌త్రాల్లో పొర‌పాటున కూడా ప్ర‌స్తావించిన పాపాన పోలేదని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. 

కేంద్ర ప్ర‌భుత్వం అంటే టీడీపీ ఏ స్థాయిలో భ‌య‌ప‌డుతున్న‌దో ఇదే నిలువెత్తు నిద‌ర్శ‌నం. కేవ‌లం బంద్‌కు వైసీపీ సంఘీభావం తెలిపింద‌ని త‌ప్పితే, రైతుల‌పై ప్రేమ‌తో కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ ఆక‌స్మికంగా బంద్‌కు మ‌ద్ద‌తు తెలిపి , ప్ర‌త్య‌ర్థుల‌ను కోలుకోలేని దెబ్బ తీస్తే …వాళ్ల‌కు బాధ‌గా ఉండ‌దాండీ!

మళ్ళీ అదే ప్రశ్న