బిజెపిలో ఎంపీ ఆశావహులంతా సేఫ్!

ఎన్ని మాటలైనా చెబుతూ ఉండవచ్చు గానీ.. తెలంగాణలో బిజెపికి ఉన్న విజయావకాశాలు తక్కువ. అందుకే కీలక నాయకులు కొందరు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకే దిగడం లేదు.  Advertisement నిన్న…

ఎన్ని మాటలైనా చెబుతూ ఉండవచ్చు గానీ.. తెలంగాణలో బిజెపికి ఉన్న విజయావకాశాలు తక్కువ. అందుకే కీలక నాయకులు కొందరు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకే దిగడం లేదు. 

నిన్న మొన్నటి దాకా భారాసకు ప్రత్యామ్నాయం తాము మాత్రమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పిన మాటలన్నీ ఇప్పుడు తేలిపోతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలో ఉండే నేతలు కూడా ఈ సారి దూరం జరుగుతున్నారు. నిజం చెప్పాలంటే వారు తమ సేఫ్టీ చూసుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.

అయితే, భారతీయ జనతా పార్టీ మీద రకరకాల కారణాల మీద అసంతృప్తితో వేగిపోతూ, సైలెంట్ గా ఉంటున్న అనేక మంది నాయకులకు పార్టీ కమిటీలకు సారథులుగా పదవులను ప్రకటించారు. ఒకవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి అధికారంలో ఉన్న కేసీఆర్ కార్పొరేషన్ పదవులను హడావుడిగా కట్టబెట్టేస్తూ.. దూకుడుగా సాగుతుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అలాంటి ప్రయత్నం చేయకుండా.. వారికి ఎంపీ టికెట్లను ఆశగా చూపిస్తూ.. ప్రస్తుతానికి పార్టీలో కమిటీల పదవులను పంచేసి సంతుష్టులను చేయాలని చూస్తున్నది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి వంటి వారిపై అసలు పార్టీ వీడిపోతారనే స్థాయిలో పుకార్లు వినిపించాయి. కోమటిరెడ్డి ప్రత్యేకంగా తాను మారడం లేదని ఖండించాల్సి వచ్చింది కూడా. అలాంటి నేపథ్యంలో వారికి పార్టీపదవుల బుజ్జగింపులు చిత్రమైన పరిణామం  ఏమీ కాదు.

భాజపాలో సోషల్ అవుట్ రీచ్ కమిటీకి కె.లక్ష్మణ్, పబ్లిక్ మీటింగ్ కమిటీకి బండి సంజయ్, ప్రజలను ప్రభావితం చేసే వారికి చేరువయ్యే కమిటీకి డికె అరుణ, మేనిఫెస్టో కమిటీకి వివేక్, చార్జిషీట్ కమిటీకి మురళీధర్ రావు, స్క్రీనింగ్ కమిటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆందోళన కమిటీకి విజయశాంతి, సోషల్ మీడియా కమిటీకి ఎంపీ అర్వింద్, ఎన్నికల కమిషన్ అంశాల కమిటీకి మర్రి శశిధర్ రెడ్డి, ప్రధాన కార్యాలయ సమన్వయ కమిటీకి నల్లు ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు, క్యాంపెయిన్ కమిటీకి వెదిరె శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీకి జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కమిటీకి గరికపాటి మోహన్ రావులను నియమించారు.

అయితే తమాషా ఏంటంటే.. వీరిలో చాలా మంది ఎమ్మెల్యే బరిలో తలపడుతున్న వారు కాదు. ఎంపీ పదవులనే కోరుకుంటున్నవారు. అలా జాగ్రత్తపడుతున్న వారి జాబితాలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.

ఎటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు.. బరిలో దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బిజెపి వచ్చే అవకాశం ఉంది గనుక.. ఎంపీ బరిలోకి దిగితే సేఫ్.. గెలిస్తే పదవుల్లో ఉంటాం. ఓడినా త్యాగం చేసిన నాయకుల కింద ఇతర పదవులు దక్కించుకోవచ్చు అనేది వారి వ్యూహంగా సాగుతోంది. కానీ.. భాజపాలో కీలక నాయకుల ఈ అతిజాగ్రత్త అనేదే ఆ పార్టీ పరాజయానికి స్పష్టమైన సంకేతాలుగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.