తాయిలాలు ఒక్కటే బుజ్జగింపుల మార్గం!

బాస్ మాట చెబితే చాలు, దాని మీద నమ్మకంతో పార్టీకి కట్టుబడి ఉండడం.. ఏదో ఒక నాటికి తమకు ఏదో ఒక దారి చూపించకపోతారా? అని ఎదురుచూస్తూ బతకడం ఇవన్నీ పాతకాలం రాజకీయాల్లోని రోజులు. …

బాస్ మాట చెబితే చాలు, దాని మీద నమ్మకంతో పార్టీకి కట్టుబడి ఉండడం.. ఏదో ఒక నాటికి తమకు ఏదో ఒక దారి చూపించకపోతారా? అని ఎదురుచూస్తూ బతకడం ఇవన్నీ పాతకాలం రాజకీయాల్లోని రోజులు. 

ఇప్పుడు ప్రతి నాయకుడికీ ఇన్‌స్టంట్ రిజల్ట్ కావాలి. ఇన్‌స్టంట్ ఫలితం కావాలి. ‘పార్టీని నమ్ముకుని ఉండు.. నేనున్నాను కదా.. నీ భవిష్యత్తు చూసుకుంటాను..’ లాంటి మాటలకు పడిపోయే వారు ఎవరూ ఉండడం లేదు. అందుకే భారత రాష్ట్ర సమితి.. తమ పార్టీలో టికెట్లు దక్కకుండా అసంతృప్తితో రగిలిపోతున్న వారికి, ఇతర పార్టీలనుంచి తమ పార్టీలోకి వలస వస్తున్న వారికి అందరికీ ఒకటే మంత్రం పఠిస్తోంది. వారు పదవులకోసం ఎదురుచూసే అవసరం లేకుండా బుజ్జగించే సమయంలోనే తాయిలాలు ప్రకటించేస్తోంది. తద్వారా.. పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతోంది.

భారాస అందరికంటె ముందు అభ్యర్థుల జాబితానను ప్రకటించి ఎడ్వాంటేజీ తీసుకుంది. ఇలాంటి ప్రయత్నం వల్ల ఉండగల ఏకైక డిసడ్వాంటేజీ.. దక్కనివాళ్లు అసంతృప్తితో పార్టీకి వెనుక గోతులు తవ్వడం. అయితే భారాస ప్రస్తుతం అధికారంలో ఉండడం అనేది వారికి ఒక ఎడ్వాంటేజీ అయింది. ఎన్నికల జాబితా ప్రకటించిన అలిగిన ఏ ఒక్కరి మీద కఠినంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. కేసీఆర్ ఇదివరకటి తీరుకు, ఇప్పటి పోకడలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ పదవులు ప్రకటించి సంతుష్టులను చేస్తూ వారి వల్ల పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీకి అనవసరం, బయటకు వెళ్లిపోయినా పర్లేదు అనుకునే వారికి మాత్రం పదవులు ఇవ్వడం లేదు.

తాండూరు టికెట్ ఆశించి భంగపడిన పట్నం మహేందర్ రెడ్డిని మంత్రిని చేయడంతోనే ఈ పర్వం మొదలైంది. వేములవాడ టికెట్ దక్కుతుందని అనుకున్న చెన్నమనేని రమేష్ కు అయిదేళ్లపాటు కేబినెట్ హోదా ఉండే వ్యవసాయ రంగ ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఆ క్రమంలో తాజాగా పదవుల పందేరం స్టార్ట్ చేశారు.

స్టేషన్ ఘనపూర్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ.. తన స్థానాన్ని కడియం శ్రీహరికోసం కోల్పోయిన రాజయ్యకు రైతు బంధు సమితి ఛైర్మన్ పదవి దక్కింది. అలాగే జనగామ స్థానంలో సిటింగ్ ను కాదని, పల్లా రాజేశ్వరరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత.. అక్కడి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్ చేశారు. 

మల్కాజిగిరి ఎమ్మెల్యేస్థానం ఈసారి భారాసకు తలనొప్పి అయింది. అక్కడి సిటింగ్ మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చినా, ఆయన కాంగ్రెసులో చేరిపోయారు. అక్కడ కొత్తగా మర్రి రాజశేఖర రెడ్డి పేరును నిర్ణయించారు. అయితే అదే స్థానంలో కాంగ్రెసు టికెట్ ఆశించి, మైనంపల్లి చేరికతో భంగపడి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్ ను భారాసలో చేర్చుకుని ఒక్కరోజులోనే ఆయనకు ఎంబీసీ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్ గుప్తా కోసం సీఎం స్వయంగా ఉండే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వైస్ చైర్మన్ పోస్టు సృష్టించి మరీ కానుకగా ఇచ్చారు. ఇలా పదవుల పందేరం ఇంకా కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది.

మైనంపల్లి కొడుకుకు కూడా మెదక్ టికెట్ ను కాంగ్రెస్ హామీ ఇవ్వడం వల్ల.. మెదక్ జిల్లా డీసీసీ అద్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు ఎరవేసి భారాసలో చేర్చుకోవడానికి కూడా మంత్రాంగం నడుస్తోంది. మంత్రి హరీశ్ రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలాంటి అనేక సమీకరణాలు ఇంకా చోటు చేసుకోనున్నాయి. 

అందరికీ పదవులు పంచేసి ప్రసన్నం చేసుకుని ఎన్నికల్లో నెగ్గడమే ధ్యేయంగా భారాస ముందుకు సాగుతోంది. బుజ్జగించడానికి పదవుల పందేరం మినహా మరో మార్గం లేదని వారు ఫిక్సయినట్టుగా ఉంది.