ఆర్కే అబద్ధాలే.. నారా వారికి పునాదులు!

ఒక మహా మేధావి తన ఊహకు తోచిన అబద్ధాలన్నింటినీ అందంగా వండి వారుస్తారు. మరో ఇద్దరు మహా నాయకులు ఆ అబద్ధాలే పునాదులుగా విమర్శలతో చెలరేగిపోతూ ఉంటారు. నిందలు వేయడానికి తెగబడుతూ ఉంటారు. ప్రాక్టికల్…

ఒక మహా మేధావి తన ఊహకు తోచిన అబద్ధాలన్నింటినీ అందంగా వండి వారుస్తారు. మరో ఇద్దరు మహా నాయకులు ఆ అబద్ధాలే పునాదులుగా విమర్శలతో చెలరేగిపోతూ ఉంటారు. నిందలు వేయడానికి తెగబడుతూ ఉంటారు. ప్రాక్టికల్ సాధ్యాసాధ్యాల గురించి ఆ మహామేధావికి గాని, ఈ మహా నాయకులకు గానీ ఆలోచన ఉండనే ఉండదు. 

కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం ఒక్కటే, ఆయనను అప్రతిష్ట పాలు చేయడం ఒకటే వారి ఉమ్మడి లక్ష్యం. ఆ మహా మహులు ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉండాలి. మహా మేధావి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే.. మహా నాయకులు నారా తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్!

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున లోటస్ పాండ్ నివాసంలో ఉదయం నాలుగున్నర గంటలకు నలుగురు ముఖ్యులతో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తయారీ సమావేశం నిర్వహించారని… తన బాబాయి వివేకా మరణ వార్త ఫోన్ ద్వారా తెలిసినప్పటికీ, సమావేశానికి తిరిగి వచ్చి బాబాయి గుండెపోటుతో చనిపోయారనే సంగతిని ప్రకటించి, సమావేశం కొనసాగించారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకు రాతల్లో కొత్త కొత్త నిందలు వేశారు. అందులో నలుగురి పేర్లు చొప్పించి ఆ నలుగురిని కూడా తక్షణం విచారిస్తే విషయం బయటపడుతుందని అన్నారు. 

బాబాయి చనిపోతే జగన్ కు ఫోను రావడంలో వింత లేదు. ముందే నిర్ణయించుకున్న సమావేశంలో ఆ సమయానికి ఆయన ఉండి ఉంటే ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. కానీ ఫోను వచ్చిన వెంటనే జగన్ సమావేశాన్ని రద్దు చేసి వెళ్లలేదు అని, అందువలన ఆయనకు నేరంలో భాగం ఉందని నిందించడమే ఇక్కడ తమాషా. 

ఆర్కే ఏదో తలా తోకా లేకుండా, తన వాదనకు తలకాయ కూడా లేకుండా.. ఏది స్పైసీగా ఉంటుందో దానిని ప్రజలకు అందించేయాలని అబద్ధాలను రాశారని అనుకుందాం. 

రాష్ట్రాన్ని ఏలాలని ముచ్చటపడుతున్న తండ్రీకొడుకులకు కూడా తల లేకుండా పోయిందా అనేది ప్రజల అనుమానం. అలాంటి అబద్ధాలను, నిజమైనా సరే అసంబద్ధమైన విషయాలను ప్రధానాంశాలుగా ప్రొజెక్టు చేస్తూ, పాదయాత్రలో కూడా అది తప్ప వేరే సబ్జెక్టే లేనట్టుగా ఎందుకు చెలరేగుతున్నారో అర్థం కాని సంగతి. 

రాధాకృష్ణ ఇలా అవాకులు, చెవాకులు వండి తన రాతల్లో కుమ్మరిస్తే.. దానిని అందుకుని తండ్రి కొడుకులు రెచ్చిపోతున్నారు. తన పాదయాత్రలో స్థానికంగా ప్రజల సమస్యలు మాట్లాడితే ప్రజలను ఆకట్టుకోవచ్చుననే మర్మం తెలియని చినబాబు జగన్ మీద నిందలు వేయడానికి, ఈ ఆర్కే అబద్ధాలను వాడుకుంటున్నారు. 

ఆర్కే ప్రచారంలో పెట్టిన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరూ ఖండించలేదు గనుక, పరమాద్భుతమైన వాస్తవం అని పచ్చదళం చంకలు గుద్దుకుంటుంది. దారిన వెళుతున్నప్పుడు మొరుగుతున్న ప్రతి కుక్క గురించి పట్టించుకుంటూ ఉంటే ఎవరి ప్రయాణమైనా సరే ఎప్పటికి పూర్తవుతుంది?