నిర్మాతల చేత నేరాలు చేయిస్తున్న బడా హీరోలు

హిట్లు, ఫ్లాపులు అనేవి సినిమారంగానికి కొత్త కాదు. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు సక్సెస్ రేటు ఇంచుమించు ఒకలాగే ఉంది. అయితే ఒకటే తేడా. సక్సెస్ వచ్చినా, ఫైల్యూర్ వచ్చినా అంకెలు మాత్రం అందలాన్ని,…

హిట్లు, ఫ్లాపులు అనేవి సినిమారంగానికి కొత్త కాదు. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు సక్సెస్ రేటు ఇంచుమించు ఒకలాగే ఉంది. అయితే ఒకటే తేడా. సక్సెస్ వచ్చినా, ఫైల్యూర్ వచ్చినా అంకెలు మాత్రం అందలాన్ని, పాతాళాన్ని తాకుతున్నాయి. దానికి కారణాలేంటి? ఎవరెవరికి ఎంతెంత పోతోంది..మొదలైన విషయాలు కాసేపు చర్చించుకుందాం. 

తాజాగా వచ్చిన “ఏజెంట్” తొలిరోజే డిసాస్టర్ అని తేలిపోయింది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి 80 కోట్లు. అయితే మొత్తమీద 14 కోట్లు వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. అంటే దాదాపు 66 కోట్ల భారీ నష్టమన్నమాట.

అలాగే దిల్ రాజు “శాకుంతలం” మీద తన వాటాగా 25 కోట్లు పోయిందని ప్రకటించారు. ఆ సినిమాకైన ఖర్చు 65 కోట్లు. 

రవితేజ నటించిన “రావణాసుర” కి 60 కోట్లు ఖర్చైతే అందులో 20% అంటే సుమారుగా 12 కోట్లు వెనక్కొచ్చిందట.

“లైగర్” సంగతైతే మరీ దారుణం. రూ. 130 కోట్లు ఖర్చైతే నాలుగో వంతు మాత్రమే సినిమా వసూలు చేయగలిగిందట. 

ఇక చిరంజీవి “ఆచార్య” అయితే రూ 140 కోట్లు ఖర్చు పెట్టించి 50% కంటే తక్కువ రికవర్ చేసుకోగలిగింది. 

మరి హిట్లొస్తేనో? మనకి తెలుసు…సుమారు 25 కోట్లతో తీసిన “కార్తికేయ2” వందకోట్లకు పైగా వసూలు చేసింది. 

దాదాపు 3 కోట్లతో తీసిన “బలగం” 26 కోట్లు గ్రాస్ చేసింది. 

ఇలా మోత మోగించే ప్రతి హిట్టు సినిమా నిర్మాతల పాలిట శాపంలా మారుతోంది. అదెలాగో చూద్దాం. 

పాత రోజుల్లో నాలుగు రూపాయలు మిగిలితే నిర్మాత జేబులో వేసుకునేవాడు. ఇప్పుడు నిర్మాతకి నాలుగు రూపాయలు మిగులుతున్నాయని తెలిస్తే హీరోనే అతని చేత ఒక ఆరు రూపాయలు ఎక్కువ ఖర్చుపెట్టిస్తున్నాడు. ఇంకా ముందు తెలిస్తే తన రెమ్యునరేషన్ కి మరో నాలుగు రూపాయలు ఎక్కువ చెప్పి పుచ్చేసుకుంటున్నాడు. ఏమన్నా అంటే సినిమాకి జనమొచ్చేది నా మొహం చూసే కదా అంటున్నాడు. దానికి తోడు తన సినిమా ఆడితే తదుపరి సినిమాకి తన మార్కెట్ రేట్ ఇంత అని చెప్పి అమాంతం రెండింతలు పెంచి మరీ గుంజేస్తున్నాడు. 

ఆశపడడంలో తప్పు లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. కానీ పక్క వాడి దీపాన్ని ఆర్పేయమనలేదు కదా. హీరోల ఆశ హద్దులు దాటి దురాశ, పేరాశ స్థాయికి పాకిపోయింది. దాంతొ నిర్మాతలకి పెను భారమయ్యి వందలకోట్ల రూపాయలు సినిమా తీయడానికి హవాలా లాంటి వక్రమార్గాల్లో తీసుకు వస్తున్నారు. అది చట్టరిత్యా నేరమని తెలిసినా తాము చేస్తున్న పులిమీద స్వారీ కి (ఇదేంటో కూడా చెప్పుకుందాం) వేరే మార్గం దొరకడంలేదు. దాంతో పాటు అధిక వడ్డీలకి భారీ మొత్తాలు తెచ్చి సినిమా పూర్తయ్యే వరకు తెచ్చిపెట్టుకున్న నవ్వులు నవ్వుతూ మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ బతుకుతున్నారు. ఎందుకంటే నిర్మాత ఆర్ధిక పరమైన టెన్షన్స్ లో ఉన్నాడని బయట ప్రపంచానికి తెలియకూడదు. ఏజ్ విషయంలో హీరోయిన్, జేబు విషయంలో నిర్మాత ఎప్పుడూ నిజమైన అంకెలు చెప్పరంతే. చెబితే ఇండస్ట్రీ దూరం పెడుతుంది. 

మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ, హీరోల దురాశ అనే మంటల్లో కాలిపోతూ బతకడమెందుకు? ఇక్కడే పులి మీద స్వారీ టాపిక్ చెప్పుకోవాలి. పులి మీద కూర్చుని స్వారీ చేస్తున్న వాడు అలా చేస్తూనే ఉండాలి. ఆగి, కిందకి దిగితే పులి తినేస్తుంది. అదేవిధంగా ఇక్కడ బడా నిర్మాతలు సినిమాలు తీయడం ఆపేస్తే బడా అప్పులు మీద పడి తినేస్తాయి. పైన చెప్పుకున్న భారీ నష్టాలొచ్చిన నిర్మాతలంతా అప్పులవాళ్లకి చెప్పేది ఒక్కటే, “నెక్స్ట్ సినిమాలో కవర్ చేస్తాం” అని. చెప్పి ఊరుకుంటే సరిపోదు. చూపించాలి. అందుకే రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టుకుంటారు. అలా లైన్లో పెట్టుకోవాలంటే హీరోలకి భారీ అడ్వాన్సులిచ్చి జపం చేస్తూ కూర్చోవాలంతే. ఆ విధంగా ట్రాపులో పడిపోతున్నారు నిర్మాతలు. 

ఇక ఈ హీరోలు నిర్మాతలు పట్టుకొచ్చిన డబ్బుని ఎలా జుర్రుకుంటారో నిజమైన ఉదాహరణలతో చెప్పుకుందాం. 

కొన్నేళ్ళ క్రితం ఒక నిర్మాతని పిలిచి ఒక యువ స్టార్ హీరో సినిమా తీద్దామన్నాడు. ఆ పిలుపు రాగానే ఈ నిర్మాత ఎగిరి గంతేసాడు. ఎందుకంటే అప్పటి వరకు తాను తీసిన ప్రతి సినిమాలోనూ తనదే కంట్రోల్ ఉండేది. అలాంటి కంట్రోలింగ్ పవర్ అక్కడ కూడా ఒక నిర్మాతగా తనకుంటుందని భావించి ఇంతలో తీసి అంత సంపాదించుకోవచ్చని అనుకున్నాడు. ఆపైన కథ విని ఓహో అనుకున్నాడు. హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి 60 లో తీస్తే ఎంత లేదనుకున్నా 80 వస్తుందని లెక్కలేసుకున్నారు. అనౌన్సెమెంట్ చేసారు. బయ్యర్లు ముందుకొచ్చారు. ప్రతిపాదనలన్నీ కలిపితేనే 115 కోట్లు వచ్చిపడుతున్నాయని తెలిసింది. దాంతో నిర్మాత తనకి దాదాపు 50 కోట్లు పైన వర్కౌట్ కాబోతోందని అనుకున్నాడు. కానీ హీరో బడ్జెట్ పెంచుదామన్నాడు. 90 లో తీద్దామన్నాడు. అంటే 25 మాత్రమే మిగులుతోంది..సరేలే.. హిట్టైతే ఇంకా ఎక్కువే వస్తాయి కదా అని పాజిటివ్ థింకింగ్ తో సరేనన్నాడు నిర్మాత. కానీ ఆ హీరో మరో తిరకాసు కూడా పెట్టాడు. తన కుటుంబ సభ్యుడొకాయన్ని కో ప్రొడ్యూసరుగా పెట్టుకుని ఆయనకి 10 కోట్లు ఇవ్వాలన్నాడు. వేరే దారి లేక దానికీ తల ఊపాల్సి వచ్చింది. మొత్తమ్మీద 15 కోట్లు వరకు వదిలాడన్నమాట అనుకుని రంగంలోకి దిగాడు. తీరా దిగ్గాక బడ్జెట్ పెరిగి ఆ 15 ని కూడా మింగేసింది. ఆ పైన సినిమా విడుదలయ్యి ఫ్లాపయ్యింది. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లంతా ఆరిపోయారు. కొంతమందికి నిర్మాత వెనక్కి కట్టాల్సొచ్చింది. చివరకి లెక్కేంటంటే నిర్మాతకి దాదాపు 20 కోట్లు ఆవిరయ్యాయి. ఆర్ధికంగా స్థితిమంతుడు కాబట్టి ఆ లాసుని తట్టుకుని మళ్లీ ఇప్పటి వరకు సినిమా తియ్యలేదు. లేకపోతే ఆయనకూడా ఆ 20 కోట్ల పులినెక్కి స్వారీ చేస్తూ ఉండాల్సొచ్చేది. 

ఇక తాజాగా మరొక హీరో ఒక కొత్త నిర్మాతతో సినిమా చేస్తున్నాడు. గోవాలో పెళ్ళి సీన్ షూట్ చెయ్యాలని 450 మందిని హైద్రాబాదు నుంచి తీసుకెళ్లాడు. ఇది ముందు అనుకున్నది కాదు. నిర్మాతకి ఓటీటీ బేరం పరంగానూ, ఏరియా సేల్స్ పరంగానూ కాస్త ఎక్కువ మిగులుతున్నాయని తెలిసి క్వాలిటీ పేరుతో మింగేయడమన్నమాట. ఆ హీరోకి ఈ మధ్యే హిట్టు కూడా వచ్చింది కాబట్టి సహజంగానే మార్కెట్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది. ఆ పాజిటివిటీ వెళ్తే హీరో జేబులొకి వెళ్లాలి లేదా సినిమా మేకింగ్ మీద ఖర్చైపోవాలి, అంతే కానీ నిర్మాతకి మిగలకూడదన్నమాట. అదీ నడుస్తున్న సినిమా చరిత్ర. 

పరిస్థితులు ఇలా ఉంటే హవాలా మార్గాల్లో డబ్బు తేవడాలు అవీ ఎక్కడాగుతాయి? నిర్మాతల చేత ఈ చట్టవ్యతిరేకమైన బ్లాక్ మనీ పూలింగ్ పనులు చేయించేది స్టార్ హీరోల పేరాశే తప్ప మరొకటి కాదు.  

భారీగా ఖర్చు పెడుతూ తమకి కూడా ఒక కార్తికేయ-2 నో, ఒక కాంతారానో తగలకపోతుందా అని వేచి చూడ్డమొకటే నిర్మాతలకి మిగిలేది. అలాంటివి తగిలినప్పుడే మొండి బకాయిల్ని తీర్చగలగడం, నాలుగు రాళ్లు వెనకేసుకోవడం జరుగుతాయి. అయితే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నంత కాలం అలాంటి వండర్స్ జరగడం బహుకష్టం. ఎందుకంటే 2022 లో రూ 1200 కోట్ల పైచిలికు వసూలు చేసిందని చెప్పుకున్న ఆర్.ఆర్.ఆర్ విషయంలో పెట్టుబడి ఎంత, కట్టిన వడ్డీలు ఎంత, నిర్మాతకి మిగిలిందెంత? వీటికి జవాబులు చెప్పుకుంటే పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతలందరికీ సత్యం మరింత తేటతెల్లమవుతుంది. 

శ్రీనివాసమూర్తి