ఈ జన్మకు చాలు.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం

సీనియర్ నటుడు మోహన్ బాబు రాజకీయాల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తను ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోనని కరాఖండింగా చెప్పేశారు. తను నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన…

సీనియర్ నటుడు మోహన్ బాబు రాజకీయాల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తను ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోనని కరాఖండింగా చెప్పేశారు. తను నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. ఇకపై తనకు, రాజకీయాలకు పూర్తి దూరం అని స్పష్టం చేశాడు. ఆయన మాటల్ని యథాతథంగా..

– ప్రత్యక్ష రాజకీయాలు ఈ జన్మకు వద్దనుకుంటున్నాను. ఈ జీవితానికి చాలు. చంద్రబాబు నాకు బంధువు, అప్పట్లో ప్రచారం చేశాను. జగన్ కూడా బంధువు. ఆయనకు కూడా ప్రచారం చేశాను. అయిపోయింది. ప్రస్తుతం నాకు సినిమాలున్నాయి. యూనివర్సిటీ పనులున్నాయి. ఇలా నాకు బోలెడు పనులున్నాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లేవు.

– ప్రతి పార్టీలోనూ నాకు కావాల్సిన స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. పేర్ని నాని గారు ఒక పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లికి నేను కూడా వెళ్లాను. బ్రదర్, బ్రేక్ ఫాస్ట్ కు ఇంటికి వస్తారా అని పిలిచాను. అందులో తప్పేముంది? చెత్తనా కొడుకులు కొంతమంది చెత్తచెత్తగా ఊహించుకుంటే ఎట్లా? అది తప్పుబడితే ఎట్లా? ఆయన నాకు స్నేహితుడు. ఎప్పట్నుంచో తెలుసు. సరదాగా మాట్లాడుకున్నాం. రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. జగన్ గారు ఏం మాట్లాడారు, మా సినిమా వాళ్లు ఏం మాట్లాడుకున్నారు, ఆ విషయాలు చెప్పండి అని నేను ఎలా అడగగలను? ఇంటికి పిలిచిన అతిథిని ఆరాలు తీస్తామా? గౌరవంగా పిలిచాం, ఆతిధ్యం ఇచ్చాం. అంతే.

– మోహన్ బాబు ఇంటికి ఎందుకెళ్లారని అంతా అడుగుతున్నారు? తప్పేంటి? ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మేధావులు, అన్ని పార్టీల వ్యక్తుల్ని నేను ఆహ్వానిస్తాను, ఇంటికొస్తారు, సరదాగా ఉంటాం, భోజనం చేస్తాం. వాళ్లు పిలిస్తే నేను కూడా వెళ్తాను. దాన్ని తప్పుబడితే ఎట్లా? టికెట్ల విషయాన్ని నేను మాట్లాడలేదు.

– విష్ణు బాబు చాలా నీట్ గా ట్వీట్ చేశాడు. ఇంటికొచ్చి, ఆతిథ్యం స్వీకరించినందుకు, ఫిలిం ఇండస్ట్రీకి చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు అన్నాడు. దాన్ని తప్పుబట్టారు. రకరకాలుగా రాసుకొచ్చారు.

ఇంత సడెన్ గా మోహన్ బాబుకు ఏమైంది?

నిజానికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానంటూ మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆయన ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల టైమ్ లో జగన్ పార్టీలో చేరిన మోహన్ బాబు, వైసీపీ తరఫున ప్రచారం చేశారంతే. ఆయన ఎక్కడా ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయలేదు.

అయితే ఇప్పుడు అదే పనిగా మోహన్ బాబు ప్రకటన చేయడం వెనక ఆయన హర్ట్ అయ్యారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీలో చేరిన తర్వాత ఆయన పలు పదవులు ఆశించారు. అందులో ముఖ్యమైంది టీటీడీ ఛైర్మన్ పదవి. అది దక్కకపోయినా కనీసం ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ అయినా చేతిలో పెడతారని మోహన్ బాబు ఆశించారు. కానీ అవేవీ జరగలేదు. మరోవైపు ఫీజు రీఇంబర్స్ మెంట్స్ విషయంలో కూడా మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారు.

వీటికితోడు రీసెంట్ గా జరిగిన ఓ ఘటన మోహన్ బాబును ఆలోచనలో పడేసింది. సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్వయంగా మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో వివాదం రాజుకుంది. ప్రభుత్వ నిర్ణయాల్ని మోహన్ బాబుతో చర్చించారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ ట్వీటేశాడు మంచు విష్ణు. దీనిపై మోహన్ బాబు హర్ట్ అయినట్టు తెలుస్తోంది.

వీటికి అదనంగా వయోభారం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విస్పష్టంగా ప్రకటించారు మోహన్ బాబు.