భీమ్లానాయక్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందా.. లేక ఏప్రిల్ 1న థియేటర్లలోకి వస్తుందా? ప్రతి రోజూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్న విషయం ఇది. మరోవైపు ఈ సినిమాను పవన్ కల్యాణ్ చూశారని,…

భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందా.. లేక ఏప్రిల్ 1న థియేటర్లలోకి వస్తుందా? ప్రతి రోజూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్న విషయం ఇది. మరోవైపు ఈ సినిమాను పవన్ కల్యాణ్ చూశారని, బాగా వచ్చిందంటూ అందర్నీ మెచ్చుకున్నట్టు కథనాలు వచ్చాయి. 

ఇక వీటికి అదనంగా రేపోమాపో ఈ సినిమాను సెన్సార్ కు పంపించబోతున్నారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఇంత ప్రచారం జరుగుతుంటే, ఎవరైనా ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిందనే అనుకుంటారు.

కానీ భీమ్లానాయక్ ఫస్ట్ కాపీ రెడీ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికాలేదు. అవును.. భీమ్లానాయక్ ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. భీమ్..భీమ్..భీమ్లానాయక్ అనే టైటిల్ సాంగ్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ తో సినిమా టోటల్ షూటింగ్ ముగుస్తుంది.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆక్యుపెన్సీ వంద శాతం వచ్చినప్పుడు, టికెట్ రేట్లు పెరిగినప్పుడు భీమ్లానాయక్ విడుదలవుతుందంటూ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని, విడుదల తేదీని రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది భీమ్లానాయక్. ఇందులో పవన్ తో పాటు రానా కూడా నటించాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడు.