ఇంటర్‌నెట్ సౌకర్యం గ్రామాలకు వచ్చిన తర్వాత ప్రపంచమంతా కుగ్రామంగా మారింది. దూరం, దగ్గర అనే పదాలకు కాలం చెల్లింది. సప్త సముద్రాల అవతల వైపున్నా… హాయిగా వాట్సప్ కాల్‌లో పరస్పరం చూసుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి. దీంతో సంస్కృతి, సంప్రదాయాలు ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు.
ప్రపంచం నలుమూలలా అన్ని దేశాల వాళ్లు ఉండడంతో అక్కడి ఆచార వ్యవహారాల్లో మంచి వాటిని సొంతం చేసుకుంటున్నారు. దీంతో కొన్ని వేడుకలు మనకు చేరువయ్యాయి. ఇదంతా ప్రపంచీకరణ పుణ్యమే. ఈ నేపథ్యంలో అవతరించిందే వాలెంటైన్స్ డే.
ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో కూడా దీన్ని వేడుకగా నిర్వహించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని హిందుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలు మాత్రం ఈ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రేమ జంటలు ఎక్కడైనా పార్కుల్లో కనిపిస్తే మాత్రం చితక్కొడతామని మధ్యప్రదేశ్‌లో శివసేన కార్యకర్తలు తాజాగా తీవ్ర హెచ్చరికలు చేశారు.
కర్రలు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ శివసేన కార్యకర్తలు హెచ్చరించడం భయాందోళన కలిగిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము కర్రలు పట్టుకుని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వాటికి అక్కడికక్కడే పెళ్లి చేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా వుండగా హైదరాబాద్‌లో కూడా ఈ తరహా హెచ్చరికలు వీహెచ్‌పీ నుంచి రావడం గమనార్హం.