ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా రాజకీయంగా బలపడాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాధిలో మతం ప్రాతిపదికన సెంటిమెంట్ రగిల్చి పబ్బం గడుపుకుంటున్నట్టు, దక్షిణాదిలో కుదరడం లేదు. కర్నాటకలో కొంత వరకూ బీజేపీ ప్రయత్నాలు ఫలించాయి. ఇక అక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి బీజేపీ ఎంతగా మతం పేరుతో రెచ్చగొడుతున్నా, ప్రజాచైతన్యం ముందు ఆ పార్టీ పాచిక పారడం లేదు.
ఏపీలో బీసీల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కాపులపై బీజేపీ కన్ను పడింది. రిజర్వేషన్ పేరుతో కాపుల మనసు చూరగొనేందుకు సరికొత్త వ్యూహాన్ని బీజేపీ రచిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ ముఖ్యనేతలు వ్యూహాత్మకంగా డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ను ఆగస్టు 15వ తేదీలోపు కల్పించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డెడ్‌లైన్ విధించారు.
ఈ డిమాండ్‌కు కొనసాగింపు అన్నట్టు… ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన మార్క్ రాజకీయానికి తెరలేపారు. ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినట్టే, కాపులకు కూడా అదే విధంగా రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ముస్లింలకు దివంగత వైఎస్సార్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని గుర్తు చేశారు.
అదే విధంగా ఇప్పుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలంటే ప్రేమని, అలాగే కాపులంటే ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 30 శాతం కాపులున్నారు. వీరిని తమ వైపు తిప్పుకుంటే బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని బీజేపీ నమ్ముతోంది. అందుకే మతం బదులు కులాన్ని నమ్ముకుంటే కాసిన్ని ఓట్లు రాల్చుతాయని ఏపీ బీజేపీ నేతలు, ఆ దిశగా బాణాన్ని సంధిస్తున్నారు.