అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో దోషి మాత్రం టీడీపీనే. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకు 9 అంశాలతో ఎజెండా రూపొందించిన కేంద్రహోంశాఖ …ఆ సమాచారాన్ని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు చేరవేసింది. ఈ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం చోటు దక్కించుకోవడంతో మళ్లీ ఒక్కసారిగా ఏపీలో ఉత్కంఠకు తెరలేపింది. ప్రత్యేక హోదాతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఏపీ ప్రజానీకం భావిస్తోంది.
అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన బీజేపీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంది. అసలు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమే కాదని ఏపీకి తీవ్ర అన్యాయానికి ఒడిగట్టింది. ఇందుకు నాటి టీడీపీ ప్రభుత్వం కూడా తోడైంది.
ప్రత్యేక హోదాతో ఏమొస్తుందని ఏపీ సమాజాన్ని నాటి సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా దబాయించారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు … చివరికి దాన్ని కూడా తీసుకు రాలేకపోయారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారం కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడం, కాసేపటికే మళ్లీ తొలగించడంలో చంద్రబాబు అదృశ్యంగా ఉంటూ కుట్ర చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించడంలో చంద్రబాబు ఆప్త మిత్రుడు సీఎం రమేశ్ ప్రముఖంగా ఉన్నారని ఎల్లో మీడియా విస్తృత ప్రచారం చేస్తుండడంతో ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నామనే నిందను మోయాల్సి వస్తోందని, దీని వల్ల రాజకీయంగా నష్టపోతామని టీడీపీ నేతలు లబోదిబోమంటున్నారు.
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వింటే, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంతగా భయపడుతున్నదో అర్థమవుతుంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పడం వల్లే ప్రత్యేక హోదాను విషయాన్ని ఎజెండా నుంచి పక్కకు తప్పించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత కోసం లక్షలాది మంది యువత ఎదురు చూస్తోందన్నారు.
ఇప్పుడు సీఎం జగన్ మౌనం వీడితే అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుందన్నారు. కేంద్రహోంశాఖ త్వరలో నిర్వహించనున్న సమావేశంలో కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరచలేకపోయారని పయ్యావుల ఆరోపించడం గమనార్హం. పయ్యావుల ఆరోపణలు, ఆవేదన విడ్డూరంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.