పవన్ అంటే ఎవడికి భయం, ఎందుకు భయం..!

పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మొదలైనప్పటి నుంచి పవన్ ని టార్గెట్ చేయడానికే అలా చేశారంటూ విమర్శలు వినిపించాయి. అసలు పవన్ కల్యాణ్ ని ఏపీ ప్రభుత్వం…

పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మొదలైనప్పటి నుంచి పవన్ ని టార్గెట్ చేయడానికే అలా చేశారంటూ విమర్శలు వినిపించాయి. అసలు పవన్ కల్యాణ్ ని ఏపీ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తుంది, పవన్ ఏమైనా ఎమ్మెల్యేనా, పోనీ ఏదైనా వార్డ్ మెంబర్ గా గెలిచారా..? ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యేని కూడా నిలుపుకోలేని అసమర్థ నాయకుడాయన. త్యాగాలు తప్ప, నేరుగా పోటీకి నిలవలేని దుస్థితిలో ఉన్న నాయకుడాయన.

పవన్ కి ఏపీ ప్రభుత్వం భయపడి, ఆయన్ను టార్గెట్ చేసిందని, ఆయన కోసమే సినిమా టికెట్ల రేట్లు తగ్గించారని, నైట్ కర్ఫ్యూ ఇంకా అమలు చేస్తున్నారని, సెకండ్ షో లకు అనుమతివ్వలేదని తెగ ప్రచారం జరుగుతోంది. దీన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి పేర్ని నాని. గతంలో పేర్ని వర్సెస్ పవన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో జరిగినప్పుడు ఎలాంటి కౌంటర్లు ఇచ్చారో, ఇప్పుడు అంతకు మించి అంటూ వాయించేశారు మంత్రి పేర్ని నాని.

పవన్ అభిమానుల్ని హర్ట్ చేసినట్టేనా..?

పవన్ కల్యాణ్ ని నేరుగా విమర్శిస్తేనే అభిమానులు తట్టుకోలేరు. అలాంటిది పవన్ ఎవరికి గొప్ప, ఎందుకు గొప్ప అంటూ హీరోలతో పోల్చి మరీ గాలి తీసేశారు నాని. ఏడాదికో సినిమా తీస్తాడు ఆయన గొప్పతనం ఏంటి అని ప్రశ్నించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన కూడా ఓ నటుడు అంతే కదా అన్నారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తాయా.. పవన్ కల్యాణ్ కి అని అడిగారు పేర్ని నాని. అక్కడితో ఆగితే పర్లేదు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అత్తారింటికి దారేది సినిమాకి కలెక్షన్లు వచ్చాయి, ఆ తర్వాత ఇప్పటి వరకు హిట్ ఉందా అని కూడా సెటైర్ వేశారు. ఆయనంటే ఎవరికీ భయం లేదు, సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా పవన్ కల్యాణ్ అంటే తమకి భయం లేదన్నారు నాని.

పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

ప్రస్తుతానికి పేర్ని నాని ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే నానికి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అందులోనూ ఇతర హీరోలతో తమ అభిమాన హీరోని పోల్చి మరీ పరువు తీస్తే వారు ఊరుకుంటారా.. ఉడికిపోతున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతానికి లాలా.. భీమ్లా అనుకోవాల్సిందే.