ఏపీకి ప్రత్యేక హోదా అన్నది హక్కుగా ఇచ్చారు. ఈ విషయంలో ఎనిమిదేళ్ళుగా పోరాటం, ఆరాటంగానే రాజకీయ కధ సాగుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ సబ్ కమిటీలో కూడా ఎనిమిదో అంశగా ప్రత్యేక హోదాను పెట్టి మళ్ళీ తీసేశారు. దాంతో ఇపుడు ఇది ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. హోదా కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన సంచలన కామెంట్స్ చేసారు. అది మా అజెండా. తమ ప్రభుత్వం ఎపుడూ కూడా హోదా విషయంలో రాజీ పడింది లేదు అని కూడా చెప్పారు.
హోదా కోసం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారీ ప్రధానిని, కేంద్ర మంత్రులను అడుగుతూనే ఉన్నారని, విభజన హమీలను నెరవేర్చమని కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. హోదా కోసం పోరాటం చేసిన పార్టీ తమదని, అందువల్ల తాము దాన్ని సాధించేవరకూ విశ్రమించమని బొత్స స్పష్టం చేశారు.
ఇక మూడు రాజధానులు అన్నది తమ ప్రభుత్వ విధాన నిర్ణయం అని ఆయన అన్నారు. మూడు రాజధానుల విషయంలో తాము ఈ రోజుకీ కట్టుబడి ఉన్నానమి, విశాఖ రాజధాని కావడం తధ్యమని బొత్స చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రత్యేక హోదా రాజకీయాన్ని రగిలిస్తూంటే మూడు రాజధానుల రచ్చ కూడా బొత్స ముందుకు తెచ్చారు. మరి ఏపీ రాజకీయాలు ఈ రెండు అంశాలతో ఒక లెక్కన కాక రేగడం ఖాయమని అంటున్నారు.