త‌గ్గేదే లేదంటున్నాడే!

మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెన‌క్కి తీసుకున్న నేప‌థ్యంలో, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా మ‌ళ్లీ ముంద‌డుగు వేయ‌ద‌నే ఆశాభావం…

మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెన‌క్కి తీసుకున్న నేప‌థ్యంలో, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా మ‌ళ్లీ ముంద‌డుగు వేయ‌ద‌నే ఆశాభావం కొంత మందిలో ఉంది. మ‌రీ ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వం వార్నింగ్ ఇవ్వ‌డం వ‌ల్లే మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెన‌క్కి తీసుకున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. అమరావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విశాఖ‌కు రాజ‌ధాని రావ‌డం త‌థ్య‌మ‌ని తేల్చి చెప్పారు.  

విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం త‌మ ప్ర‌భుత్వ‌ విధానమ‌న్నారు. ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. మూడు రాజధానుల బిల్లులో లోపాలు సవరించి, కొత్త బిల్లుతో ముందుకొస్తామ‌న్నారు. 

ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంద‌న్నారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తామ‌న్నారు.