రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఏక పక్షంగా ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జయంత్ పాటిల్ మాత్రం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. చాలా ఏళ్ల కిందటే జాతీయ పార్టీ హోదా పొందిన ఎన్సీపీ.. ఇటీవల జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎన్సీపీ పుట్టినప్పటికి.. ఆ తర్వాతి కాలంలో యూపీఏ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవులను సైతం చేపట్టారు.
కాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ 30 మందికిపైగా ఎమ్మెల్యేలతో బీజేపీ కూటమిలోకి చేరనున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతోన్న ప్రచారం దృష్టా శరద్ పవార్ రాజీనామా కీలకంగా మారింది. తర్వాతి పార్టీ అధ్యక్ష ఎన్నిక పార్టీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందన్న ఆయన.. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.