గతంలో వివాహాల విషయంలో వయసు గురించి పెద్ద ఖాతరు చేసే ధోరణి లేదు. పెళ్లికి వయసు గురించి పట్టింపులు పెద్దగా ఉండేవి కావు. యుక్త వయసుకు రాగానే పెళ్లి చేసేసే ధోరణి బాగా ఎక్కువ! తెలుగు ప్రాంతాల వరకే తీసుకుంటే… తెలంగాణలో అబ్బాయికి 17 యేళ్ల తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసే సర్వహక్కులనూ తల్లిదండ్రులు కలిగి ఉండేవారు! ఇప్పటికీ అబ్బాయిలకు అయినా కాస్త ముందుగా పెళ్లి ప్రయత్నాలు చేసేది తెలంగాణలోనే! దాదాపు దశాబ్దంన్నర కిందటి వరకూ కూడా తెలంగాణలో విద్య, ఉద్యోగం వంటి వాటితో పట్టింపు లేకుండా పాతికేళ్ల లోపే అబ్బాయికి కూడా పెళ్లి చేసే పద్ధతి ఉండేది. అయితే ఇప్పుడు రోజులు మారాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర, రాయలసీమల్లో అబ్బాయిల పెళ్లి గురించి ఇంత వేగం ఉండదు! అప్పుడు, ఇప్పుడు కూడా!
15 యేళ్ల కిందటి వరకూ కూడా.. ఏ చిన్నపాటి ఉద్యోగంతో హైదరబాద్ కు వచ్చే ఆంధ్ర-రాయలసీమ అబ్బాయిలు బ్యాచిలర్స్ గా ఇక్కడ అడుగు పెడితే, అదే వయసున్న తెలంగాణ అబ్బాయిలు పెళ్లి చేసుకుని భార్యనుసొంతూళ్లో వదిలి వచ్చిన టైపు! అబ్బాయిలకు పెళ్లి విషయంలో కూడా ఇలా ప్రాంతీయ, కుల వ్యత్యాసాలు కూడా ఉంటాయంటే ఆశ్చర్యపోతారు కొందరు.
అదే రాయలసీమ విషయానికి వస్తే.. కొన్ని కులాల్లో అబ్బాయిలకు కాస్త తొందరగా ముడిపెట్టేసే ఆలోచనాధోరణి ఉంటుంది. వ్యవసాయాధార వృత్తులు ఉండే అబ్బాయిలకు తొందరగా పెళ్లి చేసేస్తూ ఉంటారు. గొర్రెలు, బర్రెల మీద ఆధారపడితే తొందరగా పెళ్లి అనమాట. అదే కాస్త చదువుకునే వారికి, కాస్త భూములున్న కులాల్లో మాత్రం అబ్బాయిలకు పెళ్లిళ్లు లేటే. ఈ కులాల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేసేసే వారు కానీ, అబ్బాయిలకు మాత్రం అమ్మాయిలంతా అయిపోయాకే! ఒక కుటుంబంలో అన్నకు ముప్పై యేళ్లు, చిన్న చెల్లెలుకు ఏ 18 యేళ్లు ఉన్నా.. చెల్లికి పెళ్లి అయ్యేంత వరకూ అబ్బాయికి పెళ్లి ప్రసక్తి ఉండదు. ఎదిగిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని, అబ్బాయికి పెళ్లి చేస్తే దాన్ని చాలా తక్కువతనం!
అయితే 15 యేళ్లలోనే ప్రపంచం చాలా మారిపోయింది. ప్రత్యేకించి పెళ్లిళ్లు, వయసు వ్యత్యాసాల విషయంలో చాలా తేడాలు వచ్చాయి. 20 యేళ్ల కిందటి వరకూ కూడా.. అమ్మాయి కన్నా అబ్బాయి కనీసం పదేళ్ల పెద్దవాడు కావడం పెద్ద విచిత్రం కాదు. చాలా రొటీన్. 20 యేళ్ల అమ్మాయికి 30 యేళ్ల వరుడు. 25 వరకూ పెళ్లి కాని అమ్మాయికి 35 యేళ్ల వరుడు కామన్. అయితే విద్య, ఉద్యోగాల రీత్యా వచ్చిన మార్పులతో ఇప్పుడు అమ్మాయిలు సరిగ్గా తమ వయసు వాడే తమకు భర్తగా కావాలనే ధోరణి ఏర్పడింది. ఐదేళ్ల వయసులో పెద్దవాడిని కూడా *పెద్దవాడు*గా చూసేస్తున్నారు అమ్మాయిలు!
తమతో పాటు కాలేజీలో చదివిన వాడితో ఏ ఆకర్షణలో సహజం అనుకుంటే, పెద్దలు సంబంధాలు చూసే తరుణంలో కూడా ఇలా తమతో పాటు కాలేజీలో చదివే వయసు వాడే తమకు వరుడు కావాలన్నట్టుగా అమ్మాయిల ధోరణి ఉందిప్పుడు. అయితే ఎలాగూ తమతో పాటు చదివిన వాడికి ఎలాగూ అప్పుడే భారీ ప్యాకేజీలు ఉండవు. కాబట్టి.. రెండు మూడేళ్ల వాడు పెద్ద ప్యాకేజీతో రెడీగా ఉంటే ఓకే! అయితే ఐదేళ్ల పెద్దవాడు భారీ ప్యాకేజీతో ఉన్నా, *పెద్దవాడు* అయిపోతున్నాడు పాపం! తమ కన్నా చాలా పెద్ద వయసు వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం అన్నట్టుగా అమ్మాయిలు ఫీలయిపోయే ధోరణి ఉంది తెలుగునాట.
మరి ఇప్పటికీ ఎక్కడైనా పదేళ్ల వయసు వ్యత్యాసంతో పెళ్లిళ్లు జరుగుతున్నాయంటే అదో పెద్ద విశేషమే. కేవలం సెలబ్రిటీల్లో మాత్రమే కాస్తో కూస్తో ఈ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ హీరోలు నలభై దాటాకా పెళ్లి చేసుకుంటూ ఉండటం, లేదా యాభై దాటాకా పెళ్లి అనడం, వారు ఏ ముప్పై ఏళ్ల హీరోయిన్ నో పెళ్లి చేసుకున్నా.. వారి మధ్యన వ్యత్యాసం పదేళ్లను దాటిపోతోంది.
మరి ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే పరిస్థితి ఏమిటి.. 30 దాటేసిన వారు అర్లీ 20స్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏమిటి.. అంటే, దీని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు. వయసులో ఇద్దరి మధ్యన వ్యత్యాసం పదేళ్లను దాటినప్పుడు.. అమ్మాయి పరిణతి లేనిదానిగా అబ్బాయికి అనిపింవచ్చని అంటున్నారు.
అమ్మాయి అందరి అటెన్షన్ నూ కోరుకునే టైపు అయితే, అప్పటికే అబ్బాయి ఆ వయసు దాటేసి చాలా కాలం కావడంతో భార్యను ఇమ్యెచ్యూర్ గా భావించే అవకాశాలుంటాయి. ఆమె తీరు అతడికి ప్రహసనంగా అనిపిస్తుంది. దీంతో కోప్పడటం, లేని పోని గొడవలు ఉండవచ్చు. అయితే శృంగారం వరకూ తమ కన్నా చిన్నవయసు యువతిని వివాహం చేసుకున్న అబ్బాయిలు సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయని సెక్స్ థెరఫిస్టులు చెబుతారు.
యుక్తవయసులో ఉన్న తమ కన్నా పదేళ్లకు పైగా చిన్నదైన భార్యతో గడపడం వారికి ఎగ్జయిట్ మెంట్ ను ఇస్తుందని చెబుతున్నారు. అయితే అమ్మాయిలు మాత్రం తమను పెద్ద వయసువాడికి ఇచ్చి కట్టబెట్టారనే ఫీలింగ్ రానంత వరకూ ఇలాంటి దాంపత్యాలు బాగానే సాగవచ్చు ప్రస్తుత రోజుల్లో.