క‌ర్ణాట‌క‌… క‌మ‌లం పార్టీకి క‌ఠిన పరీక్ష‌!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న ద‌శ‌లో ప్రీ పోల్ స‌ర్వేలు ఆస‌క్తిని రేపుతూ ఉన్నాయి. ప్రీ పోల్ స‌ర్వేలు ఏక‌గ్రీవంగా చెబుతున్న అంశం.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి కేక్…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న ద‌శ‌లో ప్రీ పోల్ స‌ర్వేలు ఆస‌క్తిని రేపుతూ ఉన్నాయి. ప్రీ పోల్ స‌ర్వేలు ఏక‌గ్రీవంగా చెబుతున్న అంశం.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి కేక్ వాక్ కాదు అనేది! ద‌క్షిణాదిన మోడీ ఛ‌రిష్మా గ‌ట్టిగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది క‌ర్ణాట‌క మాత్ర‌మే! భార‌తీయ జ‌న‌తా పార్టీకి సౌత్ లో సోలోగా మొద‌ట అధికారం ఇచ్చింది, ఇప్ప‌టి దాకా అధికారం ఇచ్చింది క‌ర్ణాట‌క మాత్ర‌మే. 

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే క‌ర్ణాట‌క‌లో బీజేపీ చాలా బ‌లంగా ఉంది. అలాగే వ్య‌క్తిగ‌తంగా మోడీ ఛరిష్మా కూడా క‌ర్ణాట‌క‌లోనే ఎక్కువ‌! మోడీ, యోగి ఆదిత్య‌నాథ్ అంటే బాగా అభిమానించే జ‌నాలున్న‌ది క‌ర్ణాట‌క‌లోనే ఎక్కువ మిగ‌తా దక్షిణాదితో పోలిస్తే. ఈ సారి కూడా కేవ‌లం మోడీ పేరు మీదే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ యడియూర‌ప్ప రూపంలో బీజేపీకి క‌ర్ణాట‌క‌లో ఒక కీల‌క నేత ఉండేవారు. అయితే య‌డియూర‌ప్ప‌ను బీజేపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టేసింది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

మ‌రి ఇలాంటి త‌రుణంలో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి సానుకూల ఫ‌లితాలు ఉంటాయ‌ని స‌ర్వేలేవీ గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కూ వెళ్ల‌డైన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. టీవీ 9- సీ ఓట‌ర్ స‌ర్వే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ప‌రిస్థితులు అంటోంది. టీవీ 9 – సీ ఓట‌ర్ సర్వే ప్ర‌కారం… కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 116 సీట్లు ద‌క్క‌వ‌చ్చు. మ్యాజిక్ ఫిగ‌ర్ 113. ఈ స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి ద‌క్కేది 79-89 అసెంబ్లీ సీట్లు. ఒక‌వేళ బీజేపీకి 80 లోపు సీట్లు వ‌స్తే క‌న్న‌డీగులు క‌మ‌లం పార్టీని తిర‌స్క‌రించిన‌ట్టే. ఆ త‌ర్వాత ఎన్ని ఎత్తులు వేసి బీజేపీ అధికారాన్ని సంపాదించుకున్నా.. అది రాజ‌కీయ నైచ్య‌మే అవుతుంది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వం నిల‌బ‌డింది కూడా ప్ర‌జ‌లు అధికారం ఇస్తే కాదు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను తెచ్చుకుని బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది, నిల‌బెట్టుకుంది. మ‌రి ఇప్పుడు ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే.. క‌మ‌లం మ‌ళ్లీ అదే బాట‌ను ప‌డితే ప్ర‌జాస్వామ్యానికి అది అవ‌మానం అవుతుంది.

ఇక మ‌రో స‌ర్వే ప‌బ్లిక్ టీవీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే మెజారిటీ ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం కాంగ్రెస్ కు 98 నుంచి 108 సీట్లు ద‌క్క‌వ‌చ్చ‌ని అంచ‌నా. బీజేపీకి ఈ సర్వే ప్ర‌కారం 89 నుంచి 97 సీట్లు జేడీఎస్ కు పాతిక సీట్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక బీజేపీకి అనుకూలంగా కూడా రెండు స‌ర్వేలు వ‌చ్చాయి. ఏసియానెట్ సువ‌ర్ణ స‌ర్వే ప్ర‌కారం.. బీజేపీకి 98 నుంచి 109 సీట్ల వ‌ర‌కూ ద‌క్కే అవ‌కాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 97 సీట్ల వ‌ర‌కూ పోరాడే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీని ప్ర‌కారం జేడీఎస్ కు 25 నుంచి 29 సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. న్యూస్ ఫ‌స్ట్ స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి 96 నుంచి 106 సీట్ల వ‌ర‌కూ ద‌క్కే అవ‌కాశం ఉంది.

ఇక సౌత్ ఫ‌స్ట్ స‌ర్వే ప్ర‌కారం కాంగ్రెస్ కు 98, బీజేపీకి 92, జేడీఎస్ కు 27 సీట్ల వ‌ర‌కూ ద‌క్కే అవ‌కాశం ఉంది. స్థూలంగా క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మినిమం మెజారిటీని సంపాదించుకుంటుంద‌ని కూడా ఒక్క‌టంటే ఒక్క స‌ర్వేకూడా గ‌ట్టిగా చెప్ప‌డం లేదు. కాంగ్రెస్ కు మినిమం మెజారిటీ ద‌క్కుతుంద‌ని క‌నీసం ఒక్క స‌ర్వే చెబుతోంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిల‌వొచ్చు అనే స‌ర్వేలు రెండున్నాయి. కానీ బీజేపీకి మెజారిటీ ద‌క్కుతుంద‌ని మాత్రం ఒక్క‌రూ చెప్ప‌డం లేదు.

ఇలా క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌నే ఎదుర్కొంటోంది. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అంటోంది, మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌నూ చేస్తోంది, ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ఎత్తేసింది.. ఇలా త‌ను చేయ‌ద‌గినంతా బీజేపీ చేస్తోంది. మోడీ, అమిత్ షా తో స‌హా దేశంలోని క‌మ‌లం పార్టీ నేత‌లంతా క‌ర్ణాట‌క చుట్టూరానే తిరుగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ముందస్తుగా మాత్రం బీజేపీ అనుకూల‌వాద‌మేదీ అక్క‌డ వినిపించ‌డం లేదు. మ‌రి అస‌లు ఫ‌లితాలు ఎలా ఉంటాయో!

-హిమ‌