తెలంగాణలో నూతన సచివాలయం రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువైంది. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయ ప్రారంభ వేడుక బీఆర్ఎస్ సొంత వ్యవహారంగా నిర్వహించారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. అయితే నూతన సచివాలయ ప్రారంభానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, గవర్నర్ తమిళిసై రాకపోవడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానమే లేదని ఆమె పొలిటికల్ బాంబ్ పేల్చారు. దీంతో మరోసారి కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం రగిలింది. గవర్నర్‌కు ఆహ్వానం లేకపోవడంపై రాజ్‌భవన్ ఒక ప్రకటన వెలువరించడం గమనార్హం.
నూతన సచివాలయ ప్రారంభానికి గవర్నర్ రాకపోవడం అంటే అభివృద్ధి నిరోధక శక్తిగా చూపే ప్రయత్నంపై రాజ్‌భవన్ అప్రమత్తమైంది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేకపోవడంతోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్భవన్ స్పష్టం చేసింది. ఆహ్వానం పంపినా గవర్నర్ రాలేదనే బీఆర్ఎస్ విమర్శల్ని రాజ్‌భవన్ తిప్పికొట్టింది. నూతన సచివాలయ ప్రారంభ వేడుకకు మొత్తం 2500 మందికి కేసీఆర్ సర్కార్ ఆహ్వానాలు పంపింది.
వీరిలో గవర్నర్ లేకపోవడం గమనార్హం. తెలంగాణ అధికార పార్టీ నేతలు నూతన సచివాలయ ప్రారంభ వేడుకకు గవర్నర్ రాలేదంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆహ్వానించలేదని రాజ్‌భవన్ తేల్చి చెప్పడంతో రెండు వ్యవస్థల మధ్య రగడ మళ్లీ మొదటికే చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.