ఏపీలో భారీగా అభివృద్ధి ప‌నులు…ప్ర‌తిప‌క్షం మాట‌!

ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. అయితే ఈ ప‌నుల‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో జ‌రుగుతున్నాయ‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. అభివృద్ధి ప‌నులు మాత్ర‌మే…

ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. అయితే ఈ ప‌నుల‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో జ‌రుగుతున్నాయ‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. అభివృద్ధి ప‌నులు మాత్ర‌మే కాదు, సంక్షేమ ప‌థ‌కాలు కూడా బాగా అమ‌లవుతున్నాయ‌ని చెప్ప‌డం విశేషం.

ఏపీ స‌ర్కార్‌పై తెల్లారి లేచిన‌ప్ప‌టి నుంచి ఏపీలో నోటా కంటే త‌క్కువ ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన బీజేపీ నేత‌లు కూడా విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ స‌ర్కార్‌పై చార్జిషీట్ వేయ‌డానికి కూడా ఇటీవ‌ల ఏపీ బీజేపీ టీమ్‌ల‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం విష్ణు క‌ర్నాట‌క ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని పంచుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌చార నిమిత్తం క‌ర్నాట‌క వెళ్లిన ప్ర‌ధాని మోదీని ఆయ‌న క‌లుసుకున్నారు. విష్ణు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే… వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను తాను హైలెట్ చేసుకోవ‌డం విశేషం. క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించాల‌ని ప్ర‌ధాని మోదీని ఆహ్వానించానంటూ పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి ప‌నులు ప్రారంభించాల‌ని మోదీని కోరిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అలాగే కేంద్రం నిధుల‌తో సంక్షేమ పథకాలు కూడా ఏపీలో బాగా అమ‌లవుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌స్తావించ‌డం విశేషం. అలాగే ఏపీలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనాల‌ని మోదీని తాను కోరిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సభల కోసం ప్రత్యేకంగా విధులు నిర్వహించడం త‌న‌ అదృష్టంగా భావిస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. 

అస‌లే ఏపీ బీజేపీలో టీడీపీ, వైసీపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలున్నాయి. టీడీపీ, వైసీపీ నేత‌ల‌ను ఘాటుగా విమ‌ర్శించ‌డంలో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ముందుంటారు. కేంద్రం నిధుల‌తోనైనా ఏపీలో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు బాగా అమ‌ల‌వుతున్నాయ‌ని విష్ణు చెప్ప‌డం విశేషం. అయితే విష్ణు ప్ర‌క‌ట‌న‌లో పార్టీ వాయిస్‌ని ప‌క్క‌న పెట్టి, వ్య‌క్తిగ‌తంగా తాను ఫోక‌స్ కావ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంపై బీజేపీలో ఆయ‌న వ్య‌తిరేకులు గుర్రుగా ఉన్నారు.