వాళ్లందరూ ప్రచారంలోకి వస్తేనే లెక్క!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలమనే ఆశతో ఈసారి ఎన్నికలలో తలపడుతోంది. ఇప్పుడు గనుక గెలిచి అధికారంలోకి రాలేకపోయినట్లైతే.. ఇక ఎప్పటికీ అధికారంలోకి రావడం కల్ల అనే భయంతో వారు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారు.…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలమనే ఆశతో ఈసారి ఎన్నికలలో తలపడుతోంది. ఇప్పుడు గనుక గెలిచి అధికారంలోకి రాలేకపోయినట్లైతే.. ఇక ఎప్పటికీ అధికారంలోకి రావడం కల్ల అనే భయంతో వారు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారు.

కేవలం, ఈసారి ఓడిపోతే మనుగడే ఉండదనే భయం మాత్రమే.. కాంగ్రెసులో పరస్పర విభేదాలు ఉండే అనేక మంది నాయకులను ఈ ఎన్నికల వేళలో ఐక్యంగా ఉంచుతోంది. ముఠాకక్షలకు మారుపేరు అయిన కాంగ్రెసు పార్టీ ఈ ఎన్నికల్లో ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోకుండా.. అందరూ గెలవాలనే ఏకైకలక్ష్యంతోనే పోరాడుతున్నట్టుగా కనిపిస్తోంది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లోని కొందరి అలకలు ఇంకా పూర్తిగా సమసిపోయినట్లుగా లేదు. చాలాచోట్ల తిరుగుబాటు నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి విత్ డ్రా చేయించారు గానీ.. తాజాగా కూడా ఒకరిద్దరు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. కాగా.. ఇప్పటిదాకా సాగించిన ప్రచారం మొత్తం ఒకటో అంచెగానే పరిగణించి.. కాంగ్రెస్ పార్టీ గేరు మార్చాల్సిన అవసరం ఉందని పార్టీవారే భావిస్తున్నారు.

నిజానికి ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకుల్ని వీలైనంత సమైక్యంగా ఉంచుకోవడంలో మాత్రమే కాదు.. కేసీఆర్ ను వ్యతిరేకించే అనేక మంది ఇతర నాయకులనుంచి కూడా మద్దతు పొందడంలో కాంగ్రెసు సఫలమైంది. 

తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీచేయకపోవడం అనేది లోపాయికారీ ఒప్పందమే అయినప్పటికీ.. ఖమ్మం విషయానికి వచ్చేసరికి.. తెలుగుదేశం నాయకులంతా పసుపు కండువాలు వేసుకుని మరీ.. తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని సమావేశాలు, సభలు పెట్టి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కు కోదండరాం, షర్మిల కూడా మద్దతిచ్చారు. ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలలో పోటీచేయకుండా మిన్నకుండిపోయాయి. వారు కేవలం అలా ఊరకుండిపోయినంత మాత్రాన కాంగ్రెసుకు ఒరిగేదేమీ లేదు. 

ప్రొఫెసర్ కోదండరాం ను గానీ, వైఎస్ షర్మిలను గానీ.. ముమ్మరంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తిప్పవలసిన అవసరం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం కూడా పూర్తయిపోయిన తర్వాత.. ఒకటిరెండు అలకలు – బుజ్జగింపులు మిగిలిఉంటే ఇవాళ రేపట్లో సర్దుకుంటాయి. ఇక అన్ని రకాల ఆయుధాలను సమరాంగణంలోకి మోహరించాల్సిన అవసరం ఉంది.

కోదండరాం, షర్మిల లాంటి వారికి ఎంతో కొంత వారిని ఆదరించే ఓటు బ్యాంకు ఖచ్చితంగా ప్రతిచోటా ఉంటుంది. అలాంటప్పుడు.. వారేదో కాంగ్రెసు పార్టీకి మొక్కుబడి మద్దతు ప్రకటించారనే భావన ప్రజలకు కలగకుండా ఉండాలంటే.. వారిని ప్రచారంలో చురుగ్గా వాడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.