జ‌గ‌న్ అద‌న‌పు కార్య‌ద‌ర్శిపై వైసీపీ గుర్రు!

రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా కేంద్రం కాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సీఎం జ‌గ‌న్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి, ఐఏఎస్ అధికారి కె.ధ‌నుంజ‌య‌రెడ్డే అని వైసీపీ గుర్రుగా ఉంది. త‌న స్వ‌స్థ‌లంపై అభిమానంతో ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు…

రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా కేంద్రం కాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సీఎం జ‌గ‌న్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి, ఐఏఎస్ అధికారి కె.ధ‌నుంజ‌య‌రెడ్డే అని వైసీపీ గుర్రుగా ఉంది. త‌న స్వ‌స్థ‌లంపై అభిమానంతో ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని ఆయ‌న‌పై సంబంధిత నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లా కేంద్రాలు చేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ మొద‌లైంది. మొత్తం 26 జిల్లాల ప్ర‌తిపాద‌న‌ల‌తో జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వైసీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టింది. అయితే రాజంపేట లోక్‌స‌భ కేంద్రాన్ని కాద‌ని, రాయ‌చోటి కేంద్రంగా తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల పేరుతో కొత్త జిల్లాను ప్ర‌క‌టించ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్ర‌తిపాదిత అన్న‌మాచార్యుని జిల్లాలో రాజంపేట‌, రాయ‌చోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె, మ‌ద‌న‌ప‌ల్లె అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి.  

ఇదంతా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి చేసిన కుట్ర‌గా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు. ధ‌నుంజ‌య‌రెడ్డి స్వ‌స్థ‌లం రాయ‌చోటి మండ‌లం చెన్న‌ముక్క‌ప‌ల్లె. 1988లో ఆ గ్రామ స‌ర్పంచ్‌గా ధ‌నుంజ‌య్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం సివిల్స్ రాసి ఉత్తీర్ణ‌త సాధించారు. 1992లో  సర్పంచ్‌ పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. 

ఆ త‌ర్వాత  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కొలువులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారుల్లో ముఖ్య‌మైన వ్య‌క్తిగా, జ‌గ‌న్‌కు స‌న్నిహితుడిగా మెలుగుతున్నారు.

ముఖ్య‌మంత్రి వ‌ద్ద త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి త‌మ‌కు అన్యాయం చేశాడ‌ని ధ‌నుంజ‌య‌రెడ్డిపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ ఉద్య‌మం ఆగ‌దంటూ పార్టీల‌కు అతీతంగా రాయ‌చోటి మిన‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు పోరుబాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో అంద‌రి టార్గెట్ ధ‌నుంజ‌య‌రెడ్డే కావ‌డం గ‌మ‌నార్హం.