ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పక్కన పెడితే, కనీసం దానిపై చర్చిస్తారనే అంశాన్ని కూడా ఓర్వలేని తనాన్ని చూస్తున్నాం. తమకు నచ్చని నాయకుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్న నేపథ్యంలో, ఆయన నేతృత్వంలో రాష్ట్రానికి అన్యాయమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకూడదనే బలమైన కాంక్షను బయటపెడుతున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర హోంశాఖ ఈ నెల 17న చర్చిస్తుందనే సమాచారం ఏపీకి ఊపిరిపోసింది.
ఇంతకాలం ప్రత్యేక హోదా డిమాండ్ కాలం చెల్లిన అంశంగా మోదీ సర్కార్ చెబుతూ రావడం, ఇదే సందర్భంలో వైసీపీ సర్కార్ పట్టువదలకుండా ఇవ్వాలని చేస్తున్న విజ్ఞప్తులు ఫలించాయని అందరూ భావించారు. అసలు ప్రత్యేక హోదాపై చర్చే జరగకూడదని కొన్ని అదృశ్య శక్తులు కుట్రలకు తెగబడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే కేంద్ర హోంశాఖ తానిచ్చిన నోట్‌ను సవరించుకోవాల్సి వచ్చింది. పైగా ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగకుండా అడ్డుకున్న ఘనత బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావులకే దక్కుతుందని ఎల్లో చానళ్ల జర్నలిస్టులు నిస్సిగ్గుగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రత్యేక హోదాపై వీరి ప్రకటనలు, వెటకారాలు చూస్తే, వింటే… ఏపీపై ఎంత అక్కసుతో ఉన్నారో అర్థమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యల పరిష్కార మార్గాలను పరిష్కరించాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రహోంశాఖ ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చర్చనీయాంశాల్లో మొత్తం 9 ఉన్నాయి. ఈ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదాను చేర్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయనే పెద్ద చర్చకు తెరలేచింది.
గతంలో ప్రత్యేక హోదాను మోదీ సర్కార్‌కు తాకట్టు పెట్టి, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన దుష్ట శక్తులకు కన్నుకుట్టింది. బీజేపీలోని తమ నాయకులను ఉసిగొల్పి ప్రత్యేక హోదాపై అసలు చర్చే లేకుండా చేయాలనే కుట్రలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తామిచ్చిన ఎజెండాలోని ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు. అలాగే తొమ్మిది అంశాలు కాస్తా ఐదుకు తగ్గిపోయాయి. సవరించిన లేఖను రాష్ట్రాలకు హోం శాఖ పంపించింది. ఈ లేఖను శనివారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జీవీఎల్ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చెప్పడం ప్రాధాన్యం సంతరిం చుకుంది.
‘ప్రత్యేక హోదా కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించింది. రెవెన్యూ లోటు భర్తీ కూడా అంతే. ఎజెండాలో ఈ అంశాలు ఎలా వచ్చాయో ఆరా తీశాను. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక విభేదాల పరిష్కారానికే ఏర్పాటైందని, ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాల ప్రస్తావనే లేదని తెలిసింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాల ఆర్థిక సాయం అందాలన్నదే మా ఆకాంక్ష. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టిస్తోంది కాబట్టి వివరణ ఇస్తున్నా’ అని జీవీఎల్ నరసింహరావు ప్రకటించారు.
ఇది వివరణ లేక వంచనో జీవీఎల్ ఆలోచించుకోవాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు. మరోసారి కేంద్రం తన నిజస్వరూపాన్ని చాటుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుండగా ప్రత్యేక హోదాపై చర్చించే ఆస్కారమే లేదని కేంద్రహోంశాఖ ప్రకటించగానే … ఎల్లోబ్యాచ్ ఆనందానికి అవధుల్లేవు. ఎక్కడైనా మంచి చేస్తే ఆనందించడం చూశాం. కానీ ఇక్కడ అంతా రివర్స్.