ఉక్కు మంత్రికి గట్టిగానే సెగ…

నేరక పోయి విశాఖ వచ్చానూ అని కేంద్ర ఉక్కు మంత్రి అనుకునేలా ఉక్కు ఉద్యమకారులు చేశారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కలకత్తా నుంచి విజయవాడ వెళ్లాల్సి ఉండగా డైరెక్ట్…

నేరక పోయి విశాఖ వచ్చానూ అని కేంద్ర ఉక్కు మంత్రి అనుకునేలా ఉక్కు ఉద్యమకారులు చేశారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కలకత్తా నుంచి విజయవాడ వెళ్లాల్సి ఉండగా డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో విశాఖలో ట్రాన్సిట్ హాల్ట్ పెట్టుకున్నారు. అలా మూడు గంటలు సాగర తీరంలో హాయిగా ఉండవచ్చు అనుకున్న కేంద్ర మంత్రికి ఉక్కు సెగ గట్టిగా తగ్లింది.

అసలే శనివారంతో ఉక్కు ఉద్యమానికి ఏడాది కావడంతో విశాఖ సిటీ అంతా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ టైమ్ లో ఉక్కు మంత్రి విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి విశాఖ బీజేపీ నాయకులు వెళ్లారు.

ఇక కొద్ది సేపటిలో ట్రాన్సిట్ హాల్ట్ కొరకు ఆయన విశాఖ సర్క్యూట్ హౌస్ కి చేరుకుంటారు అనగానే ఉక్కు ఉద్యమకారులు వెల్లువలా అటు వైపు వెళ్ళి మరీ గో బ్యాక్ అంటూ నినదాలు ఇచ్చారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తూ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు అంటూ ఉద్యమకారులు గట్టిగా నినాదాలు చేశారు.

ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని తీర్మానించి కానీ విశాఖ రావద్దు అంటూ డిమాండ్ చేశారు. ఈ మొత్తం గడబిడను అంతా బీజేపీ వారి ద్వారా తెలుసుకున్న ఉక్కు మంత్రి తన ట్రాన్సిట్ హాల్ట్ గా ప్రభుత్వ అథిధి గృహానికి రావాల్సింది కాస్తా వేరే ఒక ప్రైవేట్ హొటల్ కి సడెన్ గా మార్చేసుకున్నారు.

మొత్తానికి ఏడాది పాటుగా చేస్తున్న ఉద్యమం, కట్టలు తెంచుకు వస్తున్న ఆగ్రహం, ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఉక్రోశం ఇవన్నీ కలసి ఉక్కు ఉద్యమం వేడిగా సాగుతున్న వేళ అనుకోని అతిథిగా విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి గారు కళ్లారా ఉక్కు ఉద్యమాన్ని చూశారు. ఉక్కు సెగ కూడా గట్టిగా ఆయనకు తగిలింది. మరి ఈ అనుభవాన్ని ఆయన కేంద్ర పెద్దలకు చెప్పి విశాఖ ఉక్కుని కాపాడుతారా. చూడాలి మరి.