మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్రపట్టడం లేదని విమర్శించారు. 420 అశోక్‌బాబు ఇంటికెళ్లి తమపై రుబాబు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, ఘీంకరిస్తున్నారని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు సర్టిఫికెట్‌తో అశోక్‌బాబు పదోన్నతి పొందాడని ఫిర్యాదు అందిందన్నారు. ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. దానిపై విచారించిన సీఐడీ నిజమే అని నిర్ధారించాక అరెస్ట్ చేశారన్నారు. దీన్ని చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోందని తప్పు పట్టారు.
అశోక్‌బాబు అరెస్ట్‌తో సీఎం జగన్‌కు ఏంటి సంబంధమని జోగి రమేశ్ ప్రశ్నించారు. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారని జోగి రమేశ్ ప్రశ్నించారు. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా? ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరని జోగి రమేశ్ తెలిపారు.
చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదని వ్యంగ్యంగా అన్నారు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కొదమ సింహాలు అని బాబుకు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారని తెలిపారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు అన్నారని, మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్ అని కొని యాడారు. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్ అని అన్నారు. ఇది జగన్ విజయం అని జోగి రమేశ్ గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదన్నారు.