ముంబైలో పెట్రోల్ ధర లీటర్ కు 90 రూపాయలకు చేరిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్-డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూనే ఉన్నాయి! లీటర్ కు రోజుకో ముప్పై- నలభై పైసల చొప్పున పెట్రోల్ ధరను పెంచుకుంటూ పోతున్నారు. జనాలకు నొప్పి తెలియకుండానే రూపాయలకు రూపాయల చొప్పున పెట్రో ధరలు పెరుగుతున్నాయి.
గతంలో రెండు మూడు నెలలకు ఒకసారో, ఐదారు నెలలకు ఒకసారో పెట్రోల్ ధర రూపాయో, రెండు రూపాయలో పెరిగితే మోడీజీతో సహా అనేక మంది గగ్గోలు పెట్టేవారు. అలా అయితే ప్రజలు గుర్తిస్తారనే లెక్కలతో తెలివిగా.. రోజువారీగా పెంచుతూ ఉన్నారు. ఇలా రెండు మూడేళ్లుగా పెట్రోల్ ధరలు రోజువారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల గరిష్ట స్థాయికి చేరింది.
లాక్ డౌన్ సమయాల్లో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోయి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి. అయితే అలాంటి ఫలాలేవీ భారతీయులకు అందనివ్వకుండా మోడీజీ తనవైన విధానాలను అవలంభిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు పెట్రోల్ ధరలను కేంద్రం ఇష్టానుసారం పెంచుకునేందుకు అనుగుణంగా ఒక బిల్లును కూడా పాస్ చేయించేసుకున్నారు. ఈ క్రమంలో పెరుగుదలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
బహుశా అతి త్వరలోనే దేశంలో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మోడీ జీ ఆధ్వర్యంలో దేశం అరుదైన ఘనతను అందుకోబోతోంది. మోడీ భక్తులు చాలా తక్కువ చేసి మాట్లాడే తృతీయ ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లీటర్ పెట్రోల్ ధర ఈ స్థాయిలో లేదు. ఈ రికార్డు ధర ఇండియాలోనే సాధ్యం అవుతూ ఉంది.
గతంలోనే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలు పెరిగితే స్వయంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ట్వీట్లేసే వారు. కాంగ్రెస్ వాళ్ల విధానాల వల్లనే పెట్రో రేట్లు పెరుగుతున్నాయంటూ దుమ్మెత్తి పోసే వాళ్లు. ఆ పాత ట్వీట్లు చెరిగిపోవు కానీ.. తను ప్రధాని అయ్యకా.. పెట్రో రేట్లను కనివినీ ఎరగని స్థాయికి తీసుకెళ్తున్నారు శ్రీమాన్ నరేంద్రమోడీ.