భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు అనూహ్యమైన భేటీలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒకసారి మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు వీర్రాజు. ఒకవైపు పవన్ కల్యాణ్ బీజేపీకి సన్నిహితుడుగా మెలుగుతున్న నేపథ్యంలో చిరంజీవితో వీర్రాజు భేటీ ఒకింత ఆసక్తిని రేపింది.
ఆల్రెడీ రాజకీయాలకు దూరదూరంగా ఉన్న చిరంజీవిని ఈ బీజేపీ నేత తిరిగి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా? అనేంత స్థాయిలో ఊహాగానాలు రేగాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలింది. సోము – చిరుల భేటీ మర్యాదపూర్వకమైనదని తేలింది.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఉన్నట్టుండి నటుడు రాజేంద్రప్రసాద్ తో సమావేశం అయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి సోము సమావేశం అయ్యారు. ఆయన వెంట నటి హేమ కూడా ఉన్నారు.
ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే.. అధికారంలో ఉన్న వారితో సన్నిహితంగా మెలిగే టైపు. వైఎస్ హయాంలో ఆయనను వెళ్లి కలిసిన సినిమా వాళ్లలో రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టారు ఈ నటుడు. ప్రత్యక్ష రాజకీయ ప్రకటనలు ఏమీ చేయకపోయినా రాజకీయ నేతలతో అలా టచ్లో కనిపిస్తూ ఉంటారు రాజేంద్రప్రసాద్. ఈ క్రమంలో సోము వీర్రాజు ఆయనతో మర్యాదపూర్వక సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఉన్నారు.