హమ్మయ్య.. ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ మనకు రావు!

పొద్దున్న లేస్తే మనకు కావాల్సిన వాళ్లు చేసే కాల్స్ కంటే, అవసరం లేని ఫోన్ కాల్స్ ఎక్కువ. క్రెడిట్ కార్డ్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా అంటూ ప్రతి రోజూ…

పొద్దున్న లేస్తే మనకు కావాల్సిన వాళ్లు చేసే కాల్స్ కంటే, అవసరం లేని ఫోన్ కాల్స్ ఎక్కువ. క్రెడిట్ కార్డ్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా అంటూ ప్రతి రోజూ ఏదో ఒక నంబర్ నుంచి కాల్స్ వస్తుంటాయి. ఎన్ని నంబర్లు బ్లాక్ చేసిన, మరో కొత్త నంబర్ పుట్టుకొస్తుంది, మళ్లీ విసిగిస్తుంది. ఆన్ లైన్ మోసాలు చేసే వ్యక్తులు వీటికి అదనం. ఇక స్పామ్ మెసేజీలకైతే అంతే లేదు.

ఇప్పుడీ తలనొప్పుల నుంచి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. టెలికం రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ప్రవేశపెట్టేలా ట్రాయ్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. వినియోగదారులకు అవాంఛిత కాల్స్, మెసేజీలు రాకుండా.. అన్ని టెలికం కంపనీలు ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.

వినియోగదారులకు తరచుగా వచ్చే ప్రచారం కాల్స్, మెసేజీల్ని ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్ ఒడిసిపడుతుంది. వెంటనే వాటిని బ్లాక్ చేస్తుంది. వినియోగదారులు తరచుగా బ్లాక్ లిస్ట్ లో పెట్టే నంబర్లతో పాటు.. కంపెనీలు అందించే సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి ఈ ఏఐ స్పామ్ ఫిల్టర్ పనిచేస్తుంది.

ఈ మేరకు ట్రాయ్ విధించిన నిబంధనను అమలు చేయడానికి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్ అంగీకరించాయి. ఏఐ ఫిల్టర్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు మొదలుపెట్టాయి.

ప్రతి టెలికం కంపెనీ కాలర్ ఐడీ ఫీచర్ ను ఎనేబుల్ చేయాలంటూ ట్రాయ్ మరో నిబంధనను కూడా తీసుకొచ్చింది. అట్నుంచి వచ్చే కాల్ ను ఎవరు చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించడంతోపాటు, ఆ వ్యక్తి లేదా కంపెనీకి చెందిన ఫొటోను కూడా చూపించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ట్రూ కాలర్ లో అందుబాటులో ఉంది. దీంతో కంపెనీలు, ట్రూ-కాలర్ తో చర్చలు షురూ చేశాయి.

ప్రస్తుతం కాల్స్ ను బ్లాక్ చేయడానికి వినియోగదారులకు డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్) అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. అన్ని టెలికం కంపెనీలు ఈ ఆప్షన్ ను అందిస్తున్నాయి. అయితే ఇది సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. చాలా కంపెనీలు, తమ ఉద్యోగుల వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుంచి వినియోగదారులకు కాల్స్ చేయిస్తున్నాయి. దీంతో డీఎన్డీ ఉద్దేశం నెరవేరడం లేదు. ఏఐ రాకతో ఇకపై ఇలాంటి నంబర్లు కూడా జామ్ అవుతాయి.