థాయ్ లాండ్ లో చిక్కిన మన జూదగాళ్లు

మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్ అని వెనకటికి ఓ మహానుభావుడు అంటే అన్నాడు కానీ, ఇప్పుడయితే మనవాళ్లు మహా జూదగాళ్లోయ్ అని అనేసేవాడు. ఐపిఎల్ కానీండి, ఎన్నికలు రానీండి. మనవాళ్లు బెట్టింగ్ తో రెడీ…

మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్ అని వెనకటికి ఓ మహానుభావుడు అంటే అన్నాడు కానీ, ఇప్పుడయితే మనవాళ్లు మహా జూదగాళ్లోయ్ అని అనేసేవాడు. ఐపిఎల్ కానీండి, ఎన్నికలు రానీండి. మనవాళ్లు బెట్టింగ్ తో రెడీ అయిపోతారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే మకావ్, శ్రీలంక నుంచి గోవా వరకు మనవాళ్లు టచ్ చేయని ప్రదేశాలు లేవు. పైగా మన వాళ్లంటే అక్కడి జూదశాలల నిర్వాహకులకు భలే మక్కువ. గౌరవం, ఫ్లయిట్ టికెట్ లు వేస్తారు. రూమ్ లు బుక్ చేస్తారు. ఇలా సకల మర్యాదలు చేస్తారు.

మన పొలిటికల్ జనాలు, సినిమా జనాలు, మామూలు వాళ్లలో కాస్త డబ్బు చేసినవారు ఈ జూదశాలలకు పర్మనెంట్ కస్టమర్లు. ఇప్పుడు థాయ్ లాండ్ ఏకంగా 63 మంది మనవాళ్లే అక్కడి పోలీసులకు చిక్కడం అంటే, ఇక మన ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరిపోయినట్లే.

జూదం అనేసరికి తెలంగాణలో బలంగా వినిపించే చీకోటి ప్రవీణ్ థాయ్ లాండ్ హోటల్ లో భారీగా నిర్వహిస్తున్న జూదంపై అక్కడి పోలీసులు కన్నేసి, మాటేసి, దాడి చేస్తే 93 మందిని అరెస్డ్ చేస్తే, వారిలో 83 మంది మన వాళ్లే. గమ్మత్తేమిటంటే అక్కడకు వెళ్లి జూదం ఆడడం కోసం టోటల్ సెటప్ అంతా ఇక్కడి నుంచే తరలించారట. ఆ సరంజామా అంతా అక్కడి హోటల్ లో సెటప్ చేసి, జూదం ప్రారంభించారు.

ఇలా చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? ఎంత భరోసా కావాలి? మన దేశంలో నేరం చేయడం వేరు. విదేశం వెళ్లి మరీ నేరం చేయడం వేరు. ఏమైనా మనవాళ్లు గొప్పవాళ్లు. మన వాళ్ల గట్స్ వేరు. ఇప్పుడు ఈ 83 మంది బడాబాబులే..అంటే బాగా డబ్బు చేసిన వారే కనుక, కిందా మీదా పడి, కావాల్సినంత ఖర్చు చేసి బయటకు వస్తారు. ఆ తరువాత అయినా ఇలాంటివి ఆపితే బెటర్. 

చీకోటి ప్రవీణ్ కు మన దగ్గర సెలబ్రిటీ హోదా వుంది. యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన లైఫ్ స్టయిల్ మొత్తం మన కళ్ల ముందు వుంటుంది.