థియేటర్లలో డిజాస్టర్ అయింది ఏజెంట్ మూవీ. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరక్ట్ చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కి, విడుదలైన ఈ మూవీకి సంబంధించి ఓ పెద్ద విషయాన్ని బయటపెట్టాడు నిర్మాత అనీల్ సుంకర. ఇంత పెద్ద ప్రాజెక్టును, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేశారట.
అవును.. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఏజెంట్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి తప్పు చేశామని ప్రకటించాడు నిర్మాత అనీల్ సుంకర. ఏజెంట్ ఫ్లాప్ నకు సంబంధించి పూర్తి బాధ్యతను తామే తీసుకుంటామని ప్రకటించిన ఈ నిర్మాత.. ఇది చాలా పెద్ద పని అని తెలిసినప్పటికీ, సాధించగలమనే నమ్మకంతో రంగంలోకి దిగామని, కానీ ఫెయిల్ అయ్యామని తెలిపాడు.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లడంతో పాటు.. కరోనాతో షూటింగ్స్ లేట్ అవ్వడం, మరికొన్ని ఇతర సమస్యల వల్ల తాము విఫలమయ్యామని చెప్పిన సుంకర.. అదే సమయంలో సినిమా పరాజయానికి సంబంధించి తాము ఎటువంటి సాకులు చెప్పదలుచుకోలేదని స్పష్టం చేశాడు.
ఏజెంట్ లాంటి ఖరీదైన తప్పు నుంచి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో అలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని ప్రకటించాడు అనీల్ సుంకర. తమపై అపార నమ్మకాన్ని పెట్టుకున్న వాళ్లందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామన్న ఈ నిర్మాత.. రాబోయే ప్రాజెక్టులతో ఏజెంట్ నష్టాల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు.