త్వరలోనే తేజ దర్శకత్వంలో గోపీచంద్ సినిమా

ఈమధ్య గోపీచంద్-తేజ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. రామబాణం సినిమా ప్రచారం కోసం గోపీచంద్ ను తేజ ఇంటర్వ్యూ చేశాడు. అది కాస్త ఘాటుగా జరిగింది. “నువ్వు ఏం పీకావ్” లాంటి అభ్యంతరకర పదజాలం…

ఈమధ్య గోపీచంద్-తేజ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. రామబాణం సినిమా ప్రచారం కోసం గోపీచంద్ ను తేజ ఇంటర్వ్యూ చేశాడు. అది కాస్త ఘాటుగా జరిగింది. “నువ్వు ఏం పీకావ్” లాంటి అభ్యంతరకర పదజాలం తేజ నోటి నుంచి వచ్చింది. అలా వైరల్ అయిన ప్రోమోతో ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఫుల్ కట్స్ తో, ఎలాంటి వివాదాలు లేకుండా ఫుల్ ఇంటర్వ్యూను విడుదల చేశారు. అది వేరే సంగతి.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆ ఇంటర్వ్యూలో తేజ-గోపీచంద్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఓ సినిమా కోసం తేజ ఫోన్ చేస్తే, గోపీచంద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా తేజను ఎవాయిడ్ చేశాడు. దానిపై తేజ, గోపీచంద్ ను ఓ రేంజ్ లో కడిగేయాలని అనుకున్నాడు. కానీ గోపీచంద్ ఇచ్చిన వివరణతో తేజ సంతృప్తి వ్యక్తం చేశాడు.

అలా ఆగిపోయిన సినిమాను ఇప్పుడు గోపీచంద్ మొదలుపెట్టబోతున్నాడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు గోపీచంద్.

తేజ-గోపీచంద్ కాంబోలో రావాల్సిన సినిమాలో బలమైన హీరోయిన్ పాత్ర ఉంది. ఆ పాత్రకు సరైన హీరోయిన్ దొరక్క అప్పట్లో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్ పైకి రాబోతోంది. అంటే, సరైన హీరోయిన్ దొరికిందన్నమాట. ఇప్పుడంతా సెట్ అయిందని, త్వరలోనే తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నానని గోపీచంద్ ప్రకటించాడు.

తొలి సినిమాతో హీరోగా ఫెయిలైన గోపీచంద్ ను విలన్ ను చేశాడు తేజ. అతడికి తిరుగులేని విలనీ ఇమేజ్ ను కట్టబెట్టాడు. ఆ తర్వాత అదే ఇమేజ్ తో హీరోగా మారి హిట్స్ కొట్టాడు గోపీచంద్. అందుకే తేజ అంటే, గోపీచంద్ కు ప్రత్యేకమైన అభిమానం. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.