జ‌గ‌న్‌కు వైసీపీ ఎమ్మెల్యేల‌ వేడుకోలు ఏమంటే…!

రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ప్ర‌తిపాద‌న‌పై వైసీపీ నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. రాయ‌చోటికి బ‌దులు రాజంపేట‌ను జిల్లాగా ప్ర‌క‌టించ‌క‌పోతే మాత్రం రానున్న ఎన్నికల్లో రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క వ‌ర్గాల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని సంబంధిత…

రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ప్ర‌తిపాద‌న‌పై వైసీపీ నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. రాయ‌చోటికి బ‌దులు రాజంపేట‌ను జిల్లాగా ప్ర‌క‌టించ‌క‌పోతే మాత్రం రానున్న ఎన్నికల్లో రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క వ‌ర్గాల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని సంబంధిత ఎమ్మెల్యేలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలది అర‌ణ్య రోద‌నైంది.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇస్తే చివ‌రిగా త‌మ గోడు వినిపించాల‌ని రాజంపేట‌, రాయ‌చోటి ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వారు రాజంపేటపై కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నారు. నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిసి రాజంపేట కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ఏర్పాటు చేయాల‌ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు.

రాజంపేట‌, రైల్వేకోడూరు, రాయ‌చోటి, బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని వైసీపీ ఎమ్మెల్యేల ప్ర‌తిపాద‌న. ఇంత‌కాలం రాజంపేట రెవెన్యూ డివిజ‌న్‌లోనే బ‌ద్వేలు కొన‌సాగింది. ఇటీవ‌ల బ‌ద్వేలు రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటైంది. దీన్ని ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లాలో క‌లిపారు. క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలోకి బ‌ద్వేలు వ‌స్తుంది. దీంతో తాజాగా బ‌ద్వేలును క‌డ‌ప‌లో క‌లిపారు.

అస‌లు డిమాండే లేని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించి కొత్త స‌మ‌స్య‌ల్ని సృష్టించ‌డం కంటే, ఉన్న‌దాన్ని గౌర‌విస్తే పార్టీకి, ప్ర‌భుత్వానికి మంచిద‌ని వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వాద‌న‌. రాజంపేట‌ను కాద‌ని ప్ర‌భుత్వం ముందుకెళితే మాత్రం రాజ‌కీయంగా త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని రాజంపేట‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి, కొర‌ముట్ల శ్రీ‌నివాసులు హెచ్చ‌రిస్తున్నారు.