బాబులో అభద్రతా భావం.. నిన్నటితో అది స్పష్టం

చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. జగన్ ను అసమర్థుడు అన్నారు. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. బాబు ప్రెస్ మీట్ పెట్టేదే ఇందుకు. దీన్ని…

చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. జగన్ ను అసమర్థుడు అన్నారు. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. బాబు ప్రెస్ మీట్ పెట్టేదే ఇందుకు. దీన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. 

అది ఆయన డ్యూటీ. కానీ ఈసారి మాత్రం బాబులో మునుపటి ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపించలేదు. ఏదో అభద్రతాభావం ఆయన్ను ఆవహించింది. తానేం చేయలేకపోతున్నాననే చేతకానితనం ఆయన మాటల్లో ధ్వనించింది. పదేళ్ల కిందటి చంద్రబాబుకు, ఇప్పటి బాబుకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

సమస్యని పట్టుకోవడంలో ఫెయిల్..

ఒకప్పుడు ఆందోళనలు చేసేవారు. సరైన సమస్యను పట్టుకొని, క్యాడర్ మొత్తాన్ని నడిపించేవారు. అవసరమైతే తను కూడా రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు సమస్యను ఎత్తుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారు. ఏ సమస్య ఎత్తుకుంటే ఎక్కడ బూమరాంగ్ అవుతుందో అనే భయం బాబు మనసును తొలిచేస్తోంది. ఆయన మాటల్లో ధ్వనిస్తోంది.

క్యాడర్ ను నడిపించలేకపోతున్నారు

ఇప్పటికే క్యాడర్ చెల్లాచెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమైంది. గ్రామాల్లో టీడీపీకి మునుపటి పట్టు లేదు. వైసీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీడీపీ గద్దెపై జెండా ఎగరేసే ధైర్యం కూడా ఎవరికీ లేదు. 

పోనీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు.. ఇతరత్రా నాయకులున్నారు అనుకున్నా.. నెల్లూరు లాంటి కార్పొరేషన్లలో సున్నా స్థానాలతో టీడీపీ పరువు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక చంద్రబాబు నిరసనలకు పిలుపునిస్తే ఎవరు ముందుకొస్తారు..? ఉన్నవాళ్లలో ఎంతమంది బాబుకు మద్దతుగా నిలుస్తారు? అసలు టీడీపీని నమ్ముకొని ఉన్న నేతలు ఎంతమంది?

ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్మించలేదు..

టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. మాజీ మంత్రులంతా రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. వారసులకి అవకాశం ఇవ్వాలంటున్నారే కానీ, కొత్తగా వచ్చే నాయకత్వాన్ని ఎదగనీయడం లేదు. పోనీ ఆ వారసులైనా హుషాలుగా ఉన్నారా అంటే అదీ లేదు. లోకేష్ తో పోటీ పడుతున్నారు. అందుకే జిల్లాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలో కరువయ్యారు. ఒకరకంగా ఇది బాబు స్వయంకృతాపరాథమే. ఎవర్నీ ఎదగనీయకుండా చేసి, ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.

ఇన్నేళ్లయినా లోకేష్ పై ఇప్పటికీ అదే డైలమా..

రాజకీయపార్టీలో అయినా, ఇతర వ్యవహారాల్లో అయినా ఎవరికైనా భవిష్యత్తుపై భరోసా ఉంటే నమ్మకంగా పనిచేస్తారు. కానీ టీడీపీలో అది లేదు. భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ని ఇంకా ప్రకటించ లేదు. ప్రకటిస్తే ముక్కుతూ మూలుగుతున్న పార్టీ చెల్లాచెదురైపోతుందని బాబుకు తెలుసు. ఈ సంగతి పక్కనపెడితే, చంద్రబాబే జగన్ ముందు అల్లాడిపోతున్నారు. 

ఇక లోకేష్ వస్తే ఆమాత్రం కూడా పార్టీ ముందుకెళ్లలేదు. టీడీపీని నందమూరి వారసుల చేతుల్లో పెట్టలేరు, అలాగని నారావారికి అంత సీన్ లేదు. లోకేష్ పై నమ్మకం లేకపోవడం వల్లే పార్టీలో ధైర్యం లేదు, పార్టీ కార్యకర్తల్లో నమ్మకం లేదు. ఆ నైరాస్యం బాబు కళ్లల్లో కనిపిస్తోంది.

పార్టీలో ఎవ్వర్ని నమ్మాలో తెలియని దీనస్థితి..

కోవర్టుల్ని ఏరిపారేస్తా, కట్టప్పల్ని ఖతం చేస్తా.. ఇదీ ఇటీవల చంద్రబాబు ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు. స్థానిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబులో ఫ్రస్టేషన్ ఆ స్థాయికి చేరుకుంది. బాబే ఎవర్నీ నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇక టీడీపీలో మిగతావారు ఎవర్ని నమ్మాలి, ఎలా నమ్మాలి, అసలెందుకు నమ్మాలి. అధికార పార్టీ అండదండల కోసం అందరూ అర్రులు చాస్తున్నారు. 

ఈ క్రమంలో లోపాయికారీగా చాలామంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. స్వచ్ఛమైన, అచ్చమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరిప్పుడు. అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారే. అందుకే పార్టీలో ఎవర్ని నమ్మాలో తెలియని అగమ్యగోచరం బాబులో కనిపిస్తోంది.

వీటన్నిటివల్ల చంద్రబాబు పూర్తిగా డల్లయిపోయారు. తన భారాన్ని తగ్గించుకునే అవకాశం లేక, వైసీపీ నాయకత్వంలో తప్పులు దొరక్క.. ఏం చేయాలో పాలుపోక.. గాల్లో బాణాలు వేస్తున్నారు. ఈ  అభద్రతా భావం, దిక్కుతోచని స్థితి బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో విమర్శలు చేయాలి కాబట్టి పైపైన చేస్తున్నట్టుంది తప్ప, బాబులో మునుపటి ఆవేశం ఇప్పుడు కనిపించడం లేదు.