ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాన్ని ఈమధ్య వేలం పాట ద్వారా అమ్మారు. దీంతో అసలు ప్రపంచంలో అతి పెద్ద వజ్రాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దొరికిన అతి పెద్ద 5 వజ్రాలేంటో చూద్దాం.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం పేరు ఎనిగ్మా. దీని బరువు 555.55 క్యారెట్లు. తాజాగా ఈ వజ్రాన్నే వేలం వేశారు. లండన్ లో దీన్ని వేలం వేయగా ఓ వ్యక్తి, క్రిప్టో కరెన్సీ ఉపయోగించి 32 కోట్ల రూపాయలకు దీన్ని కొనుగోలు చేశాడు. ఈ వజ్రం వెనక చాలా పెద్ద కథ ఉంది. 200 కోట్ల సంవత్సరాల కిందట ఉల్క లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు, ఈ అరుదైన నలుపు రంగు వజ్రం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనికి భారీగా ధర పెరగకపోవడానికి కారణం ఒక్కటే. ఈ వజ్రంలో స్వచ్ఛత తక్కువ.
ఇక ప్రపంచంలో రెండో పెద్ద వజ్రం పేరు గోల్డెన్ జూబ్లీ డైమండ్. దీని బరువు 545.67 క్యారెట్లు. దీన్ని 1985లో దక్షిణాఫ్రికాలోని ప్రీమియర్ మైన్స్ లో కనుగొన్నారు. దీని రంగును దృష్టిలో పెట్టుకొని, కనిబెట్టిన రోజు నుంచి కేవలం బ్రౌన్ అని పిలిచేవారు. థాయిలాండ్ మాజీ రాజు దీనికి గోల్డెన్ జూబ్లీ డైమండ్ అని పేరు పెట్టారు. ఈ వజ్రాన్ని చాలా దేశాల్లో ప్రదర్శనకు పెట్టారు. ప్రస్తుతం బ్యాంకాక్ లోని రాయల్ మ్యూజియంలో ఇది ఉంది.
ఇక ప్రపంచంలో మూడో పెద్ద వజ్రం కులినాన్ 1. దీని బరువు 530.20 క్యారెట్లు. దీని వెనక కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. దక్షిణాఫ్రికాలో కులినన్ సిటీలో ఉన్న గనిలో ఏకంగా 3106 క్యారెట్ల బరువున్న వజ్రాన్ని కనుగొన్నారు. 1907లో పాలనలో ఉన్న కింగ్ ఎడ్వర్డ్, ఆ వజ్రాన్ని ముక్కలు చేయమని ఆదేశించాడు. అలా ఈ భారీ వజ్రాన్ని, 9 పెద్ద ముక్కలుగా, దాదాపు వంద చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఇందులోంచి వచ్చిందే మూడో అతి పెద్ద వజ్రం కులినాన్-1.
ఇక నాలుగో పెద్ద వజ్రం పేరు ఎక్సెల్సియర్. దీన్ని కూడా దక్షిణాఫ్రికాలోనే కనుగొన్నారు. కులినాన్-1 కంటే ముందే దీన్ని కనుగొన్నారు. కులినాన్ టైపులోనే దీన్ని కూడా ముక్కలు చేశారు. 1903లో దీన్ని 10 ముక్కలు చేశారు. అందులో ఒకటి ఎక్సెల్సియర్. స్వచ్ఛత విషయంలో దీన్ని మేలురకంగా భావిస్తారు.
ఇక టాప్-5 వజ్రాల్లో ఐదో స్థానంలో నిలిచిన వజ్రం కోహినూర్. దీని కథ గురించి అందరికీ తెలిసిందే. 105.6 క్యారెట్ల బరువుతో ధగధగలాడే ఈ వజ్రం, ప్రపంచంలోనే అతి పెద్ద కట్ డైమండ్స్ లో ఒకటి. 12వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లో దీన్ని కనుగొన్నారు. అయితే ఇది విడిగా దొరికింది కాదు. కులినానా, ఎక్సెల్సియర్ టైపులోనే ఇది కూడా భారీ వజ్రమే అంటారు నిపుణులు. అయితే కోహినూర్ వజ్రాన్ని కనుగొన్నప్పుడు దాని అసలు బరువు ఎంతనేది చెప్పడానికి రికార్డులు, ఆధారాల్లేవు. ప్రస్తుతం ఈ వజ్రం, లండన్ లో ఉంది.