పిల్లల్రా మీరు.. పక్కకెళ్లి ఆడుకోండి.. అంటూ జనసైనికులకు షాకిచ్చారు మెగాస్టార్. మొన్నటివరకు ఏదో మూల జనసైనికులకు మెగాస్టార్ మీద ఆశ ఉంది. ఎప్పటికైనా మెగాస్టార్ మావాడే, పవర్ స్టార్ కి అండగా ఉంటారు, అనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పవన్-చిరంజీవి కలుస్తారనే భ్రమ కూడా వారిలో బాగా ఉంది.
ఇప్పుడా ఆశలు, భ్రమలు అన్నీ పటాపంచలయ్యాయి. చిరంజీవి జనసేనకు మద్దతిచ్చే అవకాశం లేదని తేలిపోయింది. జగన్ తో జరిగిన తాజా మీటింగ్ తో జనసైనిక్స్ కళ్లు తెరుచుకున్నాయి. వాళ్ల భ్రమలు వీడాయి.
చిరంజీవి-జగన్ భాయ్ భాయ్..
ప్రజారాజ్యం అనుభవాల తర్వాత చిరంజీవిలో చాలా మార్పు వచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసుకున్నారు చిరంజీవి. అందుకే ఎవరినీ ఎప్పుడూ విమర్శించడం లేదు. ఆ అవకాశం, అవసరం వచ్చినా కూడా సర్దుకుపోతున్నారు. అలాంటిది అధికారంలో ఉన్న వైసీపీతో చిరంజీవి సున్నం పెట్టుకుంటారంటే ఎవరూ నమ్మరు.
కానీ తమ్ముడి కోసం చిరంజీవి జనసేన వైపు వస్తారనే ఆశ మాత్రం జనసైనికుల్లో ఉంది. కానీ అది కూడా తాజా మీటింగ్ తో, జగన్ పై చిరు చేసిన వ్యాఖ్యలతో పటాపంచలైంది. సినిమావాళ్ల కష్టాలు తెలుసుకున్న పెద్దమనిషి జగన్ అని, ఆయన విజన్ ని పొగిడారు చిరంజీవి. అలాంటి చిరు.. కేవలం తమ్ముడి కోసం అవసరం లేకుండా జగన్ ని తిట్టగలరా, జనసేనతో చేతులు కలపగలరా..?
అందరి వాడు.. రాజకీయ నాయకుడు కాడు..
అందరివాడు, అజాత శత్రువు అనే ఇమేజ్ ని ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాస్త చెడగొట్టుకున్నారు చిరంజీవి. కానీ ఆ తర్వాత జ్ఞానోదయం అయింది. చిరంజీవి ఎవరి జోలికి వెళ్లడంలేదు, రాజకీయాల జోలికి అసలే వెళ్లడంలేదు. అవసరం వచ్చినప్పుడు తమ్ముడు చేస్తున్న పోరాటాలను పొగుడుతున్నారే కానీ, నేరుగా ఆయనకు మద్దతు ఎప్పుడూ ఇవ్వలేదు.
నిజంగానే చిరంజీవి పవన్ కి మద్దతివ్వాలంటే, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాలి. ఆ పని చేయలేరు కాబట్టి, ఈపనీ చేయలేరని తేలిపోయింది. ముఖ్యంగా చిరంజీవి తనపై రాజకీయ నాయకుడు అనే ముద్ర లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు. ఇటీవల రాజ్యసభ సీటు ఆఫర్ అనే విషయంపై కూడా అందుకే అంత త్వరగా స్పందించారు, ఊహాగానాలకు చెక్ పెట్టారు.
ఇండస్ట్రీ కోసం మాత్రమే..
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద మనిషి అనిపించుకోడానికే చిరంజీవి ఆలోచిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా అందుకే పెద్దగా పూసుకోలేదు. ప్రకాష్ రాజ్ కి మద్దతిచ్చినా సరే.. ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో అంతవరకే అయ్యారు. మంచు విష్ణు గెలిచినా కూడా అంతా మనవారే అన్నారు.
ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీర్చేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి టాలీవుడ్ పెద్దమనిషి మాత్రమే. పొలిటీషియన్ కాదు. దాసరి తర్వాత స్థానం చిరంజీవిదే.
సినిమాలే లోకం..
ఓ దశలో చిరంజీవి ఏడాదికో సినిమా మాత్రమే అని గిరీగీసుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమాలే లోకంగా మారిపోయారు. ప్రస్తుతం కుర్రహీరోలతో పోటీపడి మరీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. కరోనా కష్టాలు లేకపోయి ఉంటే, ఈపాటికే ఆచార్య వచ్చేసి ఉండేది, గాడ్ ఫాదర్ కూడా పూర్తయి ఉండేది. మిగతా సినిమాలు కూడా సెట్స్ పైకి వచ్చి ఉండేవి. సినిమాలే లోకంగా బతకాలనుకుంటున్న చిరంజీవి.. మెగాస్టార్ గా మాత్రమే అభిమానాన్ని కోరుకుంటున్నారు కానీ, రాజకీయనాయకుడిగా కాదు.
అదే సమయంలో తన తమ్ముడు రాజకీయాల్లో ఎదిగితే చిరంజీవికి సంతోషమే. కానీ దానికోసం తన ఇమేజ్ ని రిస్క్ లో పెట్టే పని మెగాస్టార్ ఎప్పటికీ చేయరు. ఎందుకంటే ప్రజారాజ్యంతో చిరంజీవి చాలా నేర్చుకున్నారు, జనసేనతో పవన్ కల్యాణ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు.