వట్టి మాటలు క‌ట్టిపెట్టి … పోరాటం చేసేదెన్న‌డు?

వట్టి మాటలు క‌ట్టిపెట్టి గ‌ట్టిమేలు త‌ల‌పెట్ట‌వోయ్ అన్నారు ప్ర‌సిద్ధ ర‌చ‌యిత గుర‌జాడ అప్పారావు. ఈ మాట‌ల్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పౌర స‌మాజం గుర్తు చేస్తోంది. ప్ర‌ధాని మోదీ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్…

వట్టి మాటలు క‌ట్టిపెట్టి గ‌ట్టిమేలు త‌ల‌పెట్ట‌వోయ్ అన్నారు ప్ర‌సిద్ధ ర‌చ‌యిత గుర‌జాడ అప్పారావు. ఈ మాట‌ల్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పౌర స‌మాజం గుర్తు చేస్తోంది. ప్ర‌ధాని మోదీ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖ‌రి ఒక్కో స‌మ‌యంలో ఒక్కో ర‌కంగా ఉంటూ వ‌స్తోంది. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌హీనంగా ఉన్నంత కాలం ప్ర‌ధాని మోదీకి కేసీఆర్ అండ‌గా నిలిచారు. అర్ధ‌రాత్రి పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ, దేశంలోనే మొద‌ట ఆహ్వానించిన సీఎంగా కేసీఆర్ త‌న‌కు తానుగా ప్ర‌క‌టించుకున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో విలీనం చేసుకోవ‌డం, ఇదే సంద‌ర్భంలో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న సంకేతాలు రావ‌డంతో కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్నారు. 2018లో కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే తెలంగాణ‌లో గెలుపొందారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ర‌ఘునంద‌న్‌, ఈట‌ల రాజేంద‌ర్ గెలుపొంది త‌మ బ‌లాన్ని మూడుకు పెంచుకున్నారు. అలాగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ నువ్వానేనా అనే స్థాయిలో గ‌ట్టి పోటీ ఇచ్చి, చెప్పుకో త‌గ్గ స్థానాల‌ను సొంత చేసుకుంది. త‌ద్వారా తెలంగాణ‌లో 2023లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తానే ప్ర‌త్యామ్నాయం అని బీజేపీ చెప్ప‌క‌నే చెప్పింది.

దీంతో కేసీఆర్‌లో వేడి మొద‌లైంది. ప్ర‌ధాని మోదీపై కాలు దువ్వ‌డం స్టార్ట్ చేశారు. మీడియా స‌మావేశాల్లోనూ, బ‌హిరంగ స‌భ ల్లోనూ మోదీపై యుద్ధ‌మే అంటూ శంఖారావం పూరిస్తారు. తీరా ఆచ‌ర‌ణ‌కు వస్తే ఏమీ వుండ‌దు. మాట‌ల‌తో పొద్దు గ‌డుపు తున్నార‌నే విమ‌ర్శ‌లు కేసీఆర్‌పై బ‌లంగా ఉన్నాయి. తాజాగా జ‌న‌గామ జిల్లా య‌శ్వంత్‌పూర్ వ‌ద్ద నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి మోదీపై నిప్పులు చెరిగారు. ఈ స‌భ‌లో కేసీఆర్ ఏమ‌న్నారంటే…

‘మోదీని దేశం నుంచి తరిమి కొడతాం. ఆ బలం మాకుంది. సిద్దిపేట ప్రజలు ముందుండి నన్ను పంపితే.. తెలంగాణ తీసుకొచ్చా. మీరంతా పంపితే.. కేంద్రంతో కొట్లాడుతా. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామా? ఢిల్లీపై పోరాటానికి పొమ్మంటారా?. ఢిల్లీ గోడలను బద్ధలు చేస్తా. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడతా’  అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  

‘ఇది తెలంగాణ.. ఇది పులి బిడ్డ.. భయపడేవారెవ్వరూ లేరు. ప్రధాని మోదీని తరిమికొడతాం.ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదు. మోదీని వెళ్లగొట్టి.. తెలంగాణకు ఇచ్చేటోణ్ని తీసుకొస్తాం’ అని కేసీఆర్ ఆవేశంతో ఊగిపోయారు. ప్ర‌ధాని మోదీపై పోరాడుతానంటే వ‌ద్ద‌నే వాళ్లు ఎవ‌రు? కేవ‌లం రెచ్చ‌గొట్టే మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా.. యాక్ష‌న్‌లోకి దిగాల‌ని తెలంగాణ స‌మాజం కోరుకుంటోంది. 

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కేసీఆర్ పోరాటానికి దిగితే తెలుగు స‌మాజం అంతా వెన్నుద‌న్నుగా నిలుస్తుంది. కానీ పోరాటం మాట‌ల్లో కాదు, చేత‌ల్లో చూపిన‌ప్పుడే కేసీఆర్‌కు విలువ‌. ఇప్ప‌టికైనా మాట‌ల‌ను క‌ట్టిబెట్టి మోదీపై ఎలా పోరాటం చేయాల‌ని అనుకుంటున్నారో చేత‌ల్లో చూపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.