అశోక్ బాబు అరెస్ట్.. విడుదల.. మధ్యలో చాలా..!

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తప్పుడు సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. 18 గంటలసేపు సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నారు అశోక్ బాబు. ఆ తర్వాత సీఐడీ…

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తప్పుడు సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. 18 గంటలసేపు సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నారు అశోక్ బాబు. ఆ తర్వాత సీఐడీ కోర్టుకి తరలించగా.. రాత్రి 11 గంటలకు ఆయనకు బెయిల్ వచ్చింది, విడుదలయ్యారు. మామూలుగా ఇది చాలా చిన్న మేటర్. ఓ నాయకుడు తప్పుడు సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ కావడం 24గంటల వ్యవధిలో విడుదల కావడం.. అంతా మామూలుగానే జరిగింది. కానీ ప్రతిపక్షమే మధ్యలో రాద్ధాంతం చేసింది.

అశోక్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ఆ అరెస్ట్ ను ఖండిస్తూ రచ్చ చేసినందుకు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం. దాదాపుగా అశోక్ బాబు ఎంతసేపు పోలీసుల అదుపులో ఉన్నారో.. వారు కూడా అంతసేపు కస్టడీలోనే ఉన్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు సహా మరికొంతమంది కూడా అశోక్ బాబుకి మద్దతుగా గొడవచేసి పోలీసుల కస్టడీలోకి వెళ్లారు.

ఒక్కడి కోసం ఇంతమందా..?

గతంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఇంత హడావిడి జరగలేదు. అచ్చెన్న జైల్లో మగ్గినా కూడా చంద్రబాబు నుంచి సింపతీ లేదు. విడుదలయ్యాక, ఏదో బయటకొచ్చారు అన్నట్టుగా మమ అనిపించారు. కొల్లు రవీంద్ర వ్యవహారంలో కూడా అదే జరిగింది. కానీ సొంత సామాజిక వర్గం నేత అరెస్ట్ కావడంతో చంద్రబాబు తన బుద్ధి చూపించుకున్నారు. అసలు అశోక్ బాబు అరెస్ట్ కి అంత సీన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించింది టీడీపీ. అరెస్ట్ లతో ఓవర్ యాక్షన్ చేసింది.

తప్పుడు కేసులైతే అంత రాద్ధాంతం ఎందుకు..?

ఒకవేళ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అనుకుంటే టీడీపీ అంత రాద్ధాంతం చేయడం ఎందుకు..? 24గంటల్లో బెయిలు వచ్చే కేసు అనుకున్నప్పుడు అన్ని ఆందోళనలు ఎందుకు, అరెస్ట్ లు ఎందుకు..? ఏకంగా చంద్రబాబే ప్రెస్ మీట్ పెట్టి లైన్లోకి వచ్చారంటే టీడీపీ ఈ పరువు తక్కువ పనిని ఎంతలా కవర్ చేసుకోవాలనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అలా కవర్ చేసుకుంటూ, ఇంకోవైపు ప్రభుత్వంపై నిందలు వేశారు.

మొత్తానికి పెద్దల సభ పెద్ద మనిషి ఎలాంటివారో అందరికీ ఇప్పుడు తెలిసొచ్చింది. తప్పుడు సర్టిఫికెట్ తో పదోన్నతి పొంది, తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు.. ఇప్పుడు పాపం పండి అరెస్ట్ అయ్యారు, బెయిల్ పై విడుదలయ్యారు. ఇన్నాళ్లూ గురివిందలా అందరికీ నీతులు చెప్పారు.