ఓ నిజాయతీ అధికారికి ఏపీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్… సస్పెన్షన్. ప్రభుత్వం నుంచి జీతం మాత్రమే తీసుకుంటూ, మైనింగ్ మాఫియాకు సింహస్వప్నంగా నిలిచిన గనులశాఖ ప్రాంతీయ విజిలెన్స్ స్క్వాడ్ (విజయనగరం) సహాయ సంచాలకులు ఆర్.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వం నుంచి సస్పెన్షన్‌ను అవార్డుగా తీసుకున్నారు. గనులశాఖలో ప్రతాప్‌రెడ్డి పేరు వింటే… అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి.
రాజకీయ సిఫార్సులకు, ప్రభుత్వ ఒత్తిళ్లకు, డబ్బుకు లొంగరనే పేరు ఆయన సొంతం. రాయలసీమలో పని చేస్తున్నప్పుడు రాజకీయంగా అత్యంత శక్తిమంతులైన జేసీ బ్రదర్స్‌కు చుక్కలు చూపించి, జరిమానా కట్టేలా చేసిన ఘనత ప్రతాప్‌రెడ్డిదే. ఇదే విషయాన్ని అనంతపురం జిల్లా సాక్షి జిల్లా సంచికలో ప్రత్యేకంగా రాయడం విశేషం. ప్రతాప్‌రెడ్డికి వృత్తిపై నిబద్ధత, ప్రకృతి సహజ సంపదను కాపాడ్డంలో నిజాయతీని ప్రభుత్వ అధికార పత్రిక సాక్షి గతంలో చక్కగా ఆవిష్కరించింది.
అలాంటి అధికారిపై జగన్ ప్రభుత్వంలోని కొంత మంది పె(గ)ద్దల కన్ను పడింది. ఆయనపై కుట్రలకు తెరలేపారు. నిజాయతీగా పని చేసి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడమే నేరమన్నట్టు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు తన మార్క్ తప్పులను ప్రభుత్వం తెరపైకి తేవడం గమనార్హం. గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసి తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వర్తించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం బవులవాడ సర్వే నంబర్ 74లో జి.సుధాకర్‌కు శ్రీవెంకటసాయి స్టోన్ క్రషర్ పేరిట 9 హెక్టార్లలో రహదారి కంకర లీజు వుంది. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులొచ్చినా… ప్రతాప్‌రెడ్డి తనిఖీ చేయలేదనే ఆరోపణలున్నాయి. అలాగే దాని చుట్టుపక్కల లీజులను తనిఖీ చేసి భారీ జరిమానాలు విధించారు.
ఈ నేపథ్యంలో ఆయన తన భార్యతో కలిసి బంధువుతో మాట్లాడిన ఆడియో టేప్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుధాకర్ క్వారీలో ప్రతాప్‌రెడ్డి పెట్టుబడి పెట్టారనేది ఆ ఆడియో టేప్ సారాంశం. ఈ ఆడియో టేప్‌ను మార్ఫింగ్ చేశారని, అది నిజం కాదని ఆయన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. గనులశాఖలో కొందరు అధికారులు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి తనపై కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేపట్టింది. మూడు వారాల క్రితం ప్రతాప్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇందుకు ఆయన వివరణ ఇచ్చారు. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇదిలా వుండగా గతంలో ప్రతాప్‌రెడ్డి రాయలసీమలో పని చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రకు బదిలీపై వెళ్లారు. గనులశాఖలో ప్రతాప్‌రెడ్డి డైనమిక్ ఆఫీసర్‌గా పేరొందారు. విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి వస్తున్నారంటే అక్రమార్కులు హడలిపోతారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా లీజుదారులపై కన్నేస్తూ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. గ్రావెల్, రోడ్ మెటల్, మాంగనీస్ ఇలా అన్ని రకాల మైనింగ్ వ్యాపారాలపై ఆయన దృష్టి సారించారు. ఏడాది కాలంలో ఆయన ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.254 కోట్ల మేర పెనాల్టీలు విధించి ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో మొదటి స్థానంలో నిలిచారు.
ఏక కాలంలో ప్రతాప్‌రెడ్డి 27చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారంటే… ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ నిబద్ధ తతో పని చేయడం కూడా నేరమనే సంకేతాల్ని ఏపీ సర్కార్ తాజా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వంలో కొందరు పెద్ద మనుషుల ముసుగులో ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీరి ఆగడాలకు ప్రతాప్‌రెడ్డి నిజాయతీ అడ్డంకిగా మారడం వల్లే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని గనులశాఖ అధికారులు చెబుతున్నారు.