తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్నీ తెలిసే చంద్రబాబును రాజకీయంగా ఆకాశానికెత్తారు. ఇందుకు ప్రతిఫలం ఏంటో ఆయన వెంటనే రుచి చూశారు. రజినీకాంత్‌ను ఓ రేంజ్‌లో వైసీపీ నేతలు చాకిరేవు పెట్టారు. దీంతో రజినీకాంత్ బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఇదే సందర్భంలో టీడీపీ పైకి మాత్రం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, లోలోపల సంబరపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తద్వారా రజినీకాంత్ అభిమానులంతా వైసీపీకి రాజకీయంగా శత్రువులై, తమకు అండగా నిలుస్తారనేది టీడీపీ భావన.
తాజాగా రజినీకాంత్‌పై వైసీపీ విమర్శలు చేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. రజినీని శిఖర సమానుడంటూ ఆకాశమే హద్దుగా పొగిడి, తనపై తమిళ సూపర్‌స్టార్ ప్రశంసలకు చంద్రబాబు రుణం తీర్చుకున్నారు. అయితే చంద్రబాబు ట్వీట్‌తో మరోసారి రజినీకాంత్‌పై వైసీపీ విమర్శలు పెరగడం గమనార్హం. ముందుగా చంద్రబాబు తాజా ట్వీట్ ఏంటో చూద్దాం.
“అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి”
రజినీకాంత్ లెజెండరీ పర్సనాలిటీ, శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన హీరో కాబట్టి, ఆయనపై ఎవరూ విమర్శలు చేయవద్దని చంద్రబాబు హితవు చెప్పడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రజినీకాంత్ తెలిసీతెలియక అబద్ధాలు చెప్పారని, నిజాలేంటో తాము వీడియోలు పంపుతామని చెప్పామని వారు గుర్తు చేస్తున్నారు. రజినీకాంత్‌పై విమర్శలు చేయడమే తప్పు అయితే, మరి ఎన్టీఆర్‌ను బజారుకీడ్చి, చెప్పులు వేయించిన చంద్రబాబును ఏమనాలని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తున్నారు.
రజినీకాంత్‌పై విమర్శలే బాధ కలిగిస్తుంటే, నాడు ఎన్టీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించేసేటప్పుడు , అలాగే వైశ్రాయ్ హోటల్ ఎదురుగా చెప్పులు, రాళ్లతో దాడి చేయించేటప్పుడు సంతోషం కలిగిందా అని బాబును నిలదీయడం విశేషం. నోటి దూల తమది కాదని, చంద్రబాబుదే అని దెప్పి పొడుస్తున్నారు. రజినీకాంత్‌ను వెనకేసుకు రావడం ద్వారా రెండు ఓట్లు వస్తాయని చంద్రబాబు ఆశిస్తున్నారని, కానీ తమిళ సూపర్‌స్టార్‌కు మరిన్ని చురకలు తప్పవని గ్రహించాలని హితవు చెబుతున్నారు.
ఇంతకూ ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఇప్పటికైనా గ్రహించారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన నేతకు అండగా నిలిస్తే… రజినీకాంత్ మాత్రమే కాదు, మరెవరైనా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించడం విశేషం.