ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వ‌ద్దు…ఆమెకు స్వీట్ వార్నింగ్‌!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత భూమా అఖిల‌ప్రియ‌పై ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌పై అఖిల‌ప్రియ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. త‌మ‌పై ప‌ర్స‌న‌ల్‌గా వెళితే, తాము కూడా…

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత భూమా అఖిల‌ప్రియ‌పై ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌పై అఖిల‌ప్రియ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. త‌మ‌పై ప‌ర్స‌న‌ల్‌గా వెళితే, తాము కూడా అదే కోణంలో మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై అఖిల‌ప్రియ అవాకులు చెవాకులు పేలుతోంద‌ని మండిప‌డ్డారు. మీ మాదిరిగా చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌డం త‌మ‌కు అల‌వాటు లేద‌ని అఖిల‌ప్రియ‌ను ఉద్దేశించి అన్నారు. స్కామ్‌లు, ఇసుక దోపిడీకి పాల్ప‌డిన‌ట్టు త‌న‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2012లో ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో ఎంట‌ర్ అయ్యిన‌ట్టు బ్రిజేంద్ర‌రెడ్డి చెప్పారు.

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న ఆస్తుల‌కు సంబంధించి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్‌తో స‌హా అంద‌రికీ చూపిస్తాన‌న్నారు. రాజ‌కీయాల కోసం తాను ఏం అమ్మానో, కొన్నానో డాక్యుమెంట్స్‌తో స‌హా విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెబుతాన‌న్నారు. కేవ‌లం రాజ‌కీయ ఉనికి కోసం చౌక‌బారు విమ‌ర్శ‌లు చేస్తుంటే, వాటికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.త‌న‌ను గెలిపించిన ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెబుతాన‌ని ఆయ‌న అన్నారు.

మీలాగా రాజ‌కీయాలు, ప‌ద‌వుల కోసం ఎంతైనా దిగ‌జారుతామ‌ని, ఎలాంటి విమ‌ర్శ‌లైనా చేస్తామ‌ని అంటే… మీ క‌థ‌లు బ‌య‌ట పెట్ట‌డం మొద‌లు పెడితే క‌నీసం తిరిగే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని బ్రిజేంద్ర‌రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చిల్ల‌ర‌గా మాట్లాడ్డం పెద్ద విష‌యం కాద‌న్నారు. ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడ్డం స‌రైంది కాద‌న్నారు. తాను కూడా అట్లే భావిస్తే… మీ వ‌ల్ల ఎవ‌రైతే న‌ష్ట‌పోయారో వారితోనే ప్రెస్‌మీట్లు పెట్టిస్తాన‌ని ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. 

ఆ ప‌రిస్థితి రాకుండా చూసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. ద‌మ్ముంటే రాజ‌కీయంగా ఎదుర్కోవాల‌ని సూచించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌నానికి ఏం చేశారు, అలాగే వ‌స్తే ఏం చేస్తారో చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. కాదు, కూడ‌ద‌ని ప‌ర్స‌న‌ల్‌గా వెళితే, తాము కూడా ఊరుకోమ‌ని అఖిల‌ప్రియ‌ను హెచ్చ‌రించారు.