పీఏ చెంప ఛెళ్లుమ‌నిపించిన వైసీపీ ఎమ్మెల్యే

త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి చెంప వైసీపీ ఎమ్మెల్యే ఛెళ్లుమ‌నిపించారు. ఈ ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చేయి చేసుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన…

త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి చెంప వైసీపీ ఎమ్మెల్యే ఛెళ్లుమ‌నిపించారు. ఈ ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చేయి చేసుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన ప‌రిస్థితుల గురించి తెలుసుకుం దాం. య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలున్నాయి. ఎమ్మెల్యే కన్న‌బాబురాజు, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అచ్యుతాపురం మండ‌లంలోని పూడిమ‌డ‌క గ్రామంలో సోమ‌వారం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. ఇది మ‌త్స్య‌కార గ్రామం. ఆయ‌న్ను అడ్డుకునేందుకు వ్య‌తిరేక వ‌ర్గీయులు నిర్ణ‌యించుకున్నారు. దీంతో గ్రామంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఏపీఐఐసీ పైప్‌లైన్ ప్యాకేజీ ఇప్పించ‌డంలో ఎమ్మెల్యే విఫ‌ల‌మ‌య్యారంటే ఆయ‌న్ను అడ్డుకునేందుకు మంత్రి వ‌ర్గీయులు ప్ర‌య‌త్నించారు.

ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కుంది. త‌న‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన మంత్రి అనుచ‌రుల‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలో తోపులాట జ‌రిగింది. వ్య‌తిరేక వ‌ర్గీయుల‌పై దాడికి ఎమ్మెల్యే ఆవేశంతో వెళుతుండ‌గా, ఆయ‌న పీఏ న‌వీన్‌వ‌ర్మ వారించేందుకు ప్ర‌య‌త్నించారు.

త‌న చేతిని ప‌ట్టుకుని వెన‌క్కి లాగేందుకు ప్ర‌య‌త్నించిన పీఏపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. పీఏ చెంప ఛెళ్లుమ‌నిపించ‌డంతో అక్క‌డున్న వారంతా ఉలిక్కిప‌డ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళ‌న‌కారుల‌ను అక్క‌డి నుంచి పంపేశారు. ఆ త‌ర్వాత ఉద్రిక్త వాతావ‌ర‌ణంలోనే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం జ‌రిగింది.