పెళ్లి కాకుండానే జనసేన, టీడీపీ చెట్టపట్టాల్ అనే రీతిలో తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య ప్రస్తుతం పెళ్లి చర్చలు నడుస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య మూడు ముళ్లు పడి ఏడడుగులు నడవాలంటే చాలా కథ జరగాల్సి వుంది. బీజేపీతో ఇప్పటికే వివాహ బంధంలో ఉన్న జనసేన…ముందు దాంతో తెగదెంపులు చేసుకోవాల్సి వుంటుంది. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వుంటుంది. ఎవరికి ఎవరు భరణం చెల్లించాలో తేలాల్సి వుంది.
అయితే పెళ్లి ఒకరితో, కాపురం మరొకరితో చేయడం ఆ పార్టీకి కొత్త కాదు. దీంతో మరోసారి టీడీపీతో అలాంటి రిలేషన్‌షిప్ సాగించాలని ఆ పార్టీ నాయకుడు తహతహలాడుతున్నారు. విడిపోయిన వాళ్లతో తిరిగి కలిసిపోవడం ఎంత సులువో ఏపీ రాజకీయాలను గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ మధ్య వేర్వేరు సందర్భాల్లో మూడు భేటీలు జరిగాయి. వీళ్లద్దరి మధ్య రాజకీయ పొత్తు తప్పనిసరి అని తేలిపోయింది. అయితే పవన్‌కల్యాణ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగానే, ఆయన అనుచరులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా పొత్తులపై క్లారిటీ రాకుండానే ఎమ్మిగనూరులో లోకేశ్ సభకు జనసేన శ్రేణులు వెళ్లడం గమనార్హం. లోకేశ్ సభలో జనసేన శ్రేణులు జెండాలు పట్టుకుని ఉత్సాహం ప్రదర్శించారు. అలాగే తెలుగు తమ్ముళ్లతో పాటు దత్త సోదరుడి పార్టీ కార్యకర్తలకు కూడా లోకేశ్ స్వాగతం పలకడం విశేషం.
ఇది జనసేన కాదు, టీడీపీ పల్లకి మోసే పవన్ సేన అని వైసీపీ ఇంతకాలం చేస్తున్న విమర్శలకు బలం పెరిగింది. లోకేశ్ సభలో జనసేన కార్యకర్తలు హంగామా చేయడంపై వైసీపీ సోషల్ మీడియాలో విరుచుకుపడుతోంది. టీడీపీ జెండా మోసే సమయం ఆసన్నమైందని, చంద్రబాబును పవన్, లోకేశ్‌ను ఆయన అభిమానులు భుజానకెత్తుకున్నారని, ఇందుకేనా పార్టీ పెట్టిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరో గారికి ప్యాకేజీ అందిందని, జనసేన కార్యకర్తలను చివరికి లోకేశ్‌ను మోసే కూలీలుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని దెప్పి పొడుస్తున్నారు.
2014 నాటి రాజకీయం రిపీట్ అంటే ఏమో అనుకున్నాం, చంద్రబాబుకు ఊడిగం చేయడం అని తేలిపోయిందనే పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇంత మాత్రం దానికి జనసేన రాజకీయ పార్టీ అని, దానికో జెండా, అధ్యక్షుడు తదితరాలన్నీ ఎందుకని నిలదీస్తున్నారు. డబ్బుకు జనసేన దాసోహం అని బహిరంగంగా రాజకీయ వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు.