బాబును మ‌ళ్లీ జ‌నంపై జ‌గ‌న్ రుద్దుతారా?

నాలుగు ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబునాయుడిని రాజ‌కీయంగా చూస్తున్న వాళ్లు, ఆయ‌నంటే ఒక బ‌ల‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. చంద్ర‌బాబు న‌మ్మ‌ద‌గిన నాయ‌కుడు కాద‌ని, ఎవ‌రైనా క‌రివేపాకులు వాడుకుంటార‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా 2014 నుంచి…

నాలుగు ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబునాయుడిని రాజ‌కీయంగా చూస్తున్న వాళ్లు, ఆయ‌నంటే ఒక బ‌ల‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. చంద్ర‌బాబు న‌మ్మ‌ద‌గిన నాయ‌కుడు కాద‌ని, ఎవ‌రైనా క‌రివేపాకులు వాడుకుంటార‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా 2014 నుంచి ఐదేళ్ల పాటు చంద్ర‌బాబు పాల‌న అధ్వానంగా వుండింది. క‌నీసం అంత‌కు ముందు ఐటీతో పాటు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశాడ‌ని బాబు పాల‌న గురించి ఆయ‌న్ను అభిమానించే వాళ్లు చెప్పుకునేవాళ్లు.

కానీ గ‌త ఐదేళ్ల పాల‌నంతా దోపిడీకే స‌రిపోయింద‌నే విమ‌ర్శ వుంది. ఎల్లో మీడియాని, కొన్ని వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసి, తానో గొప్ప ప‌రిపాల‌నా ద‌క్షుడిగా చంద్ర‌బాబు క్రియేట్ చేసుకున్నార‌నే అభిప్రాయం బ‌లంగా వుంది. చంద్ర‌బాబుని ఒక్క‌సారి చూసిన వాళ్లెవ‌రైనా రెండోసారి ఆద‌రించ‌రంటే అతిశ‌యోక్తి కాదు. త‌నకంటూ జ‌నంలో చంద్ర‌బాబు ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకోగ‌లిగారు. బ‌హుశా చంద్ర‌బాబు మాదిరిగా కేవ‌లం మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్ని విజ‌య‌వంతంగా నెట్టుకొచ్చిన మ‌రో నాయ‌కుడు క‌నిపించ‌రు.  

అందుకే ముఖ్య‌మంత్రులంటే ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ల‌ను మాత్ర‌మే ఎవ‌రైనా గొప్ప‌గా గుర్తు చేసుకుంటారు. చంద్ర‌బాబును కూడా జ‌నం గుర్తు పెట్టుకుంటారు. అయితే అది ఎలా అనేది ముఖ్యం. చంద్ర‌బాబు అంటే పిల్ల‌నిచ్చిన మామ‌కే కాదు, త‌మ‌కు కూడా వెన్నుపోటు పొడిచిన పాల‌కుడిగా జ‌నం గుర్తించుకుంటారు. 2014లో అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు 600 హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేదు.

రైతుల‌కు రుణ‌మాఫీ, అలాగే కుదువ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్య‌త త‌న‌దే అని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఆశ చెడ్డ‌ది. చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం లేక‌పోయినా, ఏమోలే మారిపోయాన‌ని చెబుతున్నాడ‌ని, ఓటు వేస్తే హామీని నిల‌బెట్టుకుంటార‌నే ఆశ‌తో ఆయ‌న్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. మొత్తం ఐదు విడ‌త‌ల్లో రుణ‌మాఫీ చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి, మూడింటితోనే చేతులెత్తేశారు. అలాగే బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని ఇంటికి తెస్తాన‌ని తానెప్పుడు హామీ ఇచ్చాన‌ని అడిగిన వాళ్ల‌నే నిల‌దీశారు.

ఇక బాబొస్తే జాబొస్తుంద‌ని, నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని ఇచ్చిన హామీల సంగతేంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా ఒక‌టా, రెండా హామీల‌న్నింటిని తుంగ‌లో తొక్కేయ‌డం వ‌ల్లే, రాజ‌కీయంగా ఆయ‌న్ను జ‌నం పాతాళంలోకి తోసేశారు. అలాంటి చంద్ర‌బాబుకు జ‌గ‌న్ పాల‌న మ‌ళ్లీ ఊపిరి పోసేలా సాగుతోంద‌న్న భ‌యం, ఆందోళ‌న జ‌నంలో క‌లుగుతోంది. రాజ‌కీయంగా చంద్ర‌బాబు పీడ విర‌గ‌డ అయ్యింద‌నుకుంటే, మ‌ళ్లీ జ‌గ‌న్ మ‌న నెత్తిన తీసుకొచ్చి పెట్టేలా ఉన్నాడ‌నే అభిప్రాయాలు నెమ్మ‌దిగా పెరుగుతున్నాయి.

ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాలు విజ‌య‌వంతంగా అమ‌ల‌వుతున్నా, మిగిలిన అంశాల్లో జ‌గ‌న్ పాల‌న అట్ట‌ర్ ప్లాప్ అనే వాళ్లే ఎక్కువ‌. దీంతో జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నంలో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ఇదంతా చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇక ఏడాదిలోపే గ‌డువు వుంది. అప్పుడే ఏపీలో ఏ రాజ‌కీయ పార్టీకి ఎలా వుంద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున న‌డుస్తోంది.

జ‌గ‌న్ పాల‌న‌పై పెద‌వి విరుపే. అలాగని చంద్ర‌బాబుపై సానుకూల‌త లేదు. కానీ టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే, జ‌గ‌న్‌కు అంత ఈజీ కాద‌నలేని స‌త్యం. ఈ ఫోర్స్‌ను జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. చంద్ర‌బాబుపై సహ‌జంగా సానుకైల అంశాల కంటే, జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి అనుకూలంగా మారుతుంద‌ని ఎక్కువ మంది అంటున్నారు. అబ్బే… జ‌గ‌న్ ఇలా పాలిస్తాడ‌ని అస‌లు ఊహించ‌లేద‌నే వాళ్లు ఇటీవ‌ల కాలంలో పెరుగుతున్నారు. 

జ‌గ‌న్‌లో వైఎస్సార్‌ను చూసుకోవాల‌ని అనుకున్నాం, కానీ ఆ మ‌హానుభావుడు వేరు, ఈయ‌న వేర‌బ్బా అని వాపోతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ర‌క‌మైన అభిప్రాయం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. కీడెంచి మేలు ఎంచాల‌ని పెద్ద‌లు చెప్పిన ప్ర‌కారం… ఒక‌వేళ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే, ఆ క్రెడిట్ జ‌గ‌న్ పాల‌న‌కే ద‌క్కుతుంది. ర‌క‌ర‌కాల వ్య‌తిరేక‌త దృష్టితో చంద్ర‌బాబును చూస్తున్న వాళ్ల‌కు, తిరిగి ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం ఇష్టం వుండ‌దు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబే మేలు అనే ర‌కంగా ప్ర‌స్తుతం పాల‌నారీతులున్నాయి.

అది ఒక‌ట్రెండు అంశాల్లో చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే ఏది తీసుకున్నా… బాబు లేదా వైఎస్సార్ హ‌యాంలో ఇలా లేద‌నే టాక్ వినిపిస్తోంది. తండ్రితో పాటు గ‌తంలోని ముఖ్య‌మంత్రుల కంటే గొప్ప‌గా పాలించాల‌నే ల‌క్ష్యంతో అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌, త‌న‌కు తెలియ‌కుండానే బ్యూరోక్రాట్స్ కబంధ హ‌స్తాల్లో ఇరుక్కుని మ‌రేదో చేశారు, చేస్తున్నారు. 

అధికార మ‌త్తులో ఉన్న జ‌గ‌న్ త‌న పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌ను గుర్తించి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే, అది మ‌హాద్భుత‌మే. లేదంటే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాల‌న్న ఆయ‌న ఆశ‌యం నెర‌వేర‌డం ఎంత క‌ష్ట‌మో కాల‌మే గుణ‌పాఠం చెప్ప‌డం త‌థ్యం.