చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఉబలాటపడుతున్నాడు. అయితే చంద్రబాబు చరిత్ర తెలిసిన వాళ్లకి పాపం పవన్ అనిపిస్తుంది. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు ఒక మాట అనేవాడని సన్నిహితుడు చెబుతారు.
“మనం నిచ్చెన ఎక్కుతున్నప్పుడు చూపు పై మెట్టు మీద వుండాలి. మన కాలి కింద నలిగే కింది మెట్టు మీద కాదు”
బాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇలాంటి కొటేషన్స్ ఇంకా చాలా చెబుతారు. రాజకీయాల్లోకి రావడానికి సాయం చేసిన రాజగోపాలనాయుడిని ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా గెలవడానికి ఆర్థిక సాయం చేసిన వాళ్లని గెలిచిన మర్నాడే మరిచిపోయాడు. మంత్రి కావడానికి తోడ్పడిన సుబ్రమణ్యం నాయుడు (అప్పటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఆర్థిక కష్టాలతో చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సమీప బంధువు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎన్టీఆర్‌కి ఏం జరిగిందో కొత్తగా ఎందుకు? నమ్మి చేతులు కలిపిన దగ్గుబాటి, హరికృష్ణల పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. లోకేష్‌కి అడ్డం వస్తాడని జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడు. బాబు నిచ్చెనమెట్ల థియరీలో అందరూ కాలికింద నలగాల్సిన మెట్లే. ఎవరైనా ఆయనకి ఉపయోగపడాల్సిందే.
ఇపుడు పవన్‌కళ్యాణ్ వంతు. వెళ్లి ధృతరాష్ట్రున్ని కౌగిలించుకుంటున్నాడు. ఆ ధృతరాష్ట్రునికి కళ్లు లేవు. ఈయనకి వున్నాయి. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్.
పవన్ లక్ష పుస్తకాలు చదివాను అంటాడు. పుస్తకాలు చదివినంత ఈజీకాదు, చంద్రబాబుని చదవడం. పవన్‌తో అవసరం వుంది కాబట్టి ఈ స్నేహం. లేకపోతే బాబు తలుపులు కూడా తెరుచుకునేవి కావు.
విషయం ఏమంటే జగన్‌కి వ్యతిరేకత వున్న మాట నిజం. సహజంగా ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత కొంత, జగన్ స్వయంగా తెచ్చుకున్న వ్యతిరేకత కొంత. అయితే ఈ వ్యతిరేకత ఆయన్ని అధికారం నుంచి తప్పిస్తుందో లేదో ఇపుడు స్పష్టంగా చెప్పలేం కానీ, సీట్లు గ్యారెంటీగా తగ్గుతాయి. వై నాట్ 175 ఒక భ్రాంతి మాత్రమే. జగన్ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం చాలా గట్టిగా వుంటుంది. జనసేన పవన్‌ని ఈసారి అసెంబ్లీలో ఎదుర్కోక తప్పదు.
ఒకవేళ జనసేన, టీడీపీ అలయెన్స్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. పవన్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, జనసేనకి కొన్ని మంత్రి పదవులు దక్కుతాయి. కొద్ది రోజులు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో లాగా “ఆనాటి హృదయాల” అని బాబు స్నేహగీతం పాడతాడు. అధికార ఆనందంలో పవన్ కోరస్ పలుకుతాడు. ఏమీ లేనపుడే సీఎం అని అరిచిన పవన్ అభిమానులు ఇపుడు వదులుతారా? డిప్యూటీ అనే పదమే వాళ్లకి నచ్చదు. సీఎం అని అరవడం స్టార్ట్ చేస్తారు. Then game begins.
పవన్ ఎమోషనల్ కాబట్టి కావాలనే టీడీపీ నుంచి ఎవరో ఒకరు రెచ్చగొడతారు. ఇదంతా స్కెచ్. పవన్‌తో తప్పులు చేయిస్తారు. అవన్నీ భూతద్దంలో చూపే మీడియా ఎలాగూ వుంది. పవన్ వైపు నిలబడ్డానికి ఎవరున్నారు? ప్రభుత్వం రావడానికి జనసేన రెక్కల కష్టం కారణమని పవన్‌తో అనిపిస్తారు. పవన్‌తో ఎంతో రాజీకి ప్రయత్నించామని, ఇక ఆయనతో వుంటే ప్రభుత్వాన్ని నడపలేమని తేల్చి జనసేన నుంచి కొందరిని చీల్చి పవన్‌ని బయటికి పంపేస్తారు. “కల ఇదని, నిజం కాదని” అనే పాట పవన్‌కి మిగులుతుంది.
గతంలో అందరికీ జరిగిందే పవన్‌కీ జరుగుతుంది. సినిమాల్లో మాత్రమే హీరోలు గెలుస్తారు. రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో వేరే చెప్పక్కరలేదు.
అయితే ఈ పొలిటికల్ సర్కస్ చూసే అవకాశం జగన్ ఇస్తాడో లేదో తెలియదు. ఎన్నికలు ఇంకా దూరమున్నాయి.