మొన్న రష్మిక.. ఈసారి కాజోల్

డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటికిమొన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదింకా…

డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటికిమొన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదింకా కొలిక్కి రాకముందే, ఇప్పుడు మరో సెలబ్రిటీ “డీప్ ఫేక్” బారిన పడింది. 

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టున్న ఆ వీడియో, చూడ్డానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. ప్రస్తుతం ఇది నెట్ లో చక్కర్లు కొడుతోంది.

డీప్ ఫేక్ టెక్నాలజీని వాడినప్పటికీ ఈ వీడియోలో ఓ క్షణం పాటు అసలు మహిళ ఎవరనేది కనిపిస్తుంది. ఆమె ముఖాన్ని తొలిగించి, ఆ స్థానంలో కాజోల్ ముఖాన్ని ఏఐ టెక్నాలజీ సహాయంతో పెట్టారు. కెమెరా ముందు దుస్తులు మార్చుకుంటున్న వీడియో ఇది.

టిక్ టాక్ లో ట్రెండ్ గా మారిన 'గెట్ రెడీ విద్ మి' వీడియోల్లో ఇది కూడా ఒకటి. జూన్ 5న ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. దీన్ని ఏఐ ద్వారా మార్చి కాజోల్ ముఖాన్ని తగిలించారు. ఈ పని ఎవరు చేశారనేది ఇంకా నిర్థారణ కాలేదు.

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఈ డీప్ ఫేక్ వీడియోల నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని నిపుణులు చెబుతున్నారు. చట్టాన్ని మరింత కఠినంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా వీడియోలపై ఇప్పటికే కేంద్రం, అన్ని సోషల్ మీడియా వేదికలకు సూచనలు చేసింది. అభ్యంతరకమైన వీడియోలు, సందేశాలున్నప్పుడు, రిపోర్ట్ చేసిన వెంటనే 36 గంటల్లోగా తొలిగించాలనే ఆదేశాలున్నాయి. కానీ ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోల విషయంలో ఇది పనిచేయడం లేదు. 

ప్రస్తుతం కాజోల్ డీప్ ఫేక్ వీడియోపై ఆమె అభిమానులతో పాటు, అజయ్ దేవగన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. మరోవైపు సైబర్ నిపుణులు కూడా ఈ వీడియోల్ని షేర్ చేయొద్దని, చట్టరీత్యా నేరమని చెబుతున్నారు.