రిపబ్లికన్ టీవీ షో ను చంద్రబాబు లాబీయిస్టులు అడ్డు పెట్టుకున్న తీరు, అక్కడ ప్రశ్నలు అడిగించిన తీరు, ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ చంద్రబాబు కోసం లాగానే ఉంది, మధ్యలో ఉన్నట్టుండి రజనీకాంత్ ను కూడా రచ్చలోకి దించేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని అవకాశం ఉన్న అన్ని అస్త్రాలనూ వాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక అంశంపై మాత్రం అందరికీ క్లారిటీ ఇస్తున్నట్టున్నారు. అదే కమలం పార్టీతో పొత్తు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఎత్తులన్నీ ఇప్పుడు కమలం పార్టీతో పొత్తు కోసం ఆరాటం లాగానే ఉన్నాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే తన నైజాన్ని బాహాటంగా చాటుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీతో దోస్తీ కోసం చాలా పాకులాడుతున్నారు.
ఆ మధ్య ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏదో అవకాశం చూసుకుని ఢిల్లీకి వెళ్లి మోడీకి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు మోడీగారు చంద్రబాబు గారును చాలా బాగా పలకరించారని, చంద్రబాబుతో మాట్లాడాల్సినవి చాలానే ఉన్నాయని, త్వరలోనే సమావేశం పెట్టుకుందామంటూ మోడీ చెప్పారని పచ్చమీడియా అచ్చొత్తింది.
మరి ఇదంతా జరిగి అటూ ఇటూ ఏడాది అవుతున్నట్టుగా ఉంది. చంద్రబాబును చూసి మోడీ పరవశించిపోయారని.. త్వరలోనే ఇద్దరి సమావేశం అనేంత రేంజ్ లో అప్పుడు హడావుడి చేశారు. అయితే మోడీకి మళ్లీ చంద్రబాబు గుర్తొచ్చినట్టుగా లేరు. మరి గుర్తు చేయడానికి పవన్ కల్యాణ్ ఎలాగూ ఉండనే ఉన్నారు. అయినా ప్రయోజనం కలుగుతున్నట్టుగా లేదు.
అయితే పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వాన్నే చంద్రబాబు నమ్ముకుంటున్నట్టుగా లేడు. అందుకోసమే రజనీకాంత్ ను కూడా రంగంలోకి దించేసినట్టే. బీజేపీ ముఖ్య నేతలతో రజనీకాంత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే తమిళ రాజకీయం వరకూ రజనీ చెప్పిన అంశాలను ఏమైనా బీజేపీ వాళ్లు పరిగణనలోకి తీసుకుంటారేమో కానీ, ఏపీ రాజకీయంలో రజనీ మాటను వారు ఏ మేరకు చెవిన వేసుకుంటారనేది అనుమానమే! అయితే చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునే టైపు కాదు.
అందుకు నిదర్శనమే ఇప్పుడు రజనీ ద్వారా బీజేపీ కి విన్నపాలు చేయించే యత్నంలాగుంది. మరి పొత్తు లేనిదే తను లేనని చంద్రబాబు నాయుడుకు పూర్తిగా అర్థం అయ్యింది గత ఎన్నికలతోనే. ఏనాడూ సొంతంగా గెలవడం కాదు కదా, కనీసం పోటీ చేసిన చరిత్ర కూడా లేదు. అలాంటిది 2019లో సొంతంగా పోటీ చేసి చిత్తు చిత్తు అయ్యారు. ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న చంద్రబాబుకు కాన్ఫిడెన్స్ చాలుతున్నట్టుగా లేదు. ఎలాగైనా బీజేపీని కలుపుకోవాలనే ప్రయత్నాలు మాత్రం అత్యంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్టున్నాయి.