ఒకవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటూ మరోవైపు చంద్రబాబు చుట్టూరా తిరుగుతున్నారు పవన్ కల్యాణ్. ఇందులో దాపరికం ఏమీ లేదు. జస్ట్ చంద్రబాబు ఏజెంట్ లా పవన్ కల్యాణ్ పని చేస్తూ ఉన్నారు.
చంద్రబాబు అవసరం కోసం భారతీయ జనతా పార్టీని కూడా ఎన్నికల పొత్తుకు ఒప్పించేందుకు పవన్ కల్యాణ్ పాట్లు పడుతున్నారు. ఢిల్లీలోని బీజేపీ వాళ్లేమో ఒప్పుకుంటున్నట్టుగా లేరు. ఈయనను మరీ అసంతృప్తికి గురిచేయకుండా వారి ఇళ్లలోని వారు ఫొటోలు దిగి, పంపిస్తున్నారు. ఇలా సినిమా నటుడిగా పవన్ ఇగో అయితే సంతృప్తి చెందుతూ ఉండవచ్చు.
అటు ఢిల్లీకి వెళ్లి వచ్చి, ఇక్కడ చంద్రబాబుకు అప్ డేట్స్ ఇస్తూ పవన్ కల్యాణ్ కొరియర్ బాయ్ కల్యాణ్ అనిపించుకుంటున్నారు. ఆ సంగతలా ఉంటే.. ఈ భేటీపై బీజేపీకి ప్రశ్నలు తప్పడం లేదు. ఎంతైనా బీజేపీ మిత్రుడు కాబట్టి.. పవన్ గురించి బీజేపీ నేతల వద్ద మీడియా ఆరా తీస్తోంది. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం వెనుక కథేమిటంటూ ప్రస్తావిస్తోంది. ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వద్ద మీడియా ప్రస్తావించగా.. ఆయన ఏం స్పందించాలో అర్థం కానట్టుగా రియాక్షన్ ఇచ్చారు.
వారి సమావేశం గురించి తనను అడగడం ఏమిటని, ఎవరిని అడిగితే పూర్తి స్పష్టత వస్తుందో వారినే అడగాలంటూ సోము వ్యాఖ్యానించారు. ఆ సమావేశం గురించి వెళ్లి పవన్ కల్యాణ్ నో, చంద్రబాబునో అడగాలి కానీ తనను అడిగితే ఏం తెలుస్తుందన్నట్టుగా సోము స్పందన ఉంది. మరి మిత్రపక్షం కాబట్టి.. సోమును అడగడంలో మీడియా తప్పేం లేదు. ఆ సమావేశంపై తమ స్పందన ఏమిటో అయినా బీజేపీ చెప్పవచ్చు.
అయితే పవన్ చర్యలు కమలం పార్టీ కి ఇలా చికాకుగా మారుతూ ఉన్నాయి. ఆయన గురించి ఏం స్పందించాలో కూడా అర్థం కానట్టుగా ఉంది వారి పరిస్థితి. అయితే ఒక్కటైతే స్పష్టం అవుతోంది.. పవన్ చర్యలను ఏపీ బీజేపీ నేతలు కూడా సమర్థించడం లేదు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశానికి అందమైన భాష్యమేదో చెప్పి సమర్థించే పనిని సోము పెట్టుకోలేదు. వెళ్లి ఆయననే అడగండి అంటూ పవన్ సంగతులు తమకు తెలియవన్నట్టుగా కుండబద్ధలు కొట్టేశారు.
అయితే ఆదినారాయణ రెడ్డి లాంటి బీజేపీలోని చంద్రబాబు మనుషులు మాత్రం.. ఈ సమావేశం తర్వాత స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసేస్తాయంటూ ప్రకటించేసి, ఈలలు కొట్టించుకున్నారు!